“హా..హ..వేస్తే ఏకంగా వల వేసేయాలి గాని

 

“హా..హ..వేస్తే ఏకంగా వల వేసేయాలి గాని మళ్ళీ గేలం ఎందుకు...?”అందో గడుసుపిల్ల ఓ సినిమాలో. మరి మన కెసిఆర్ ఆ సినిమా చూసాడో ఏమో! ఆ పిల్ల మాటలతో ప్రేరణ పొందినట్లు, ఇలాగ ఎoతకాలం ఒక్కొక్కపార్టీకీ గాలం వేసుకొంటూ రోజులు వెళ్లదీయడం అనుకొన్నాడో ఏమో మరి, ఈసారి ఏకంగా పెద్దవల పట్టుకొనివచ్చేసాడు. ఆ వలలో ఎన్ని చేపలుపడితే అన్నేపడనీ గానీ మునుపటి గాలం కన్నాకొంచెం ఎక్కువే పడవచ్చు కదా అనే ఆశాభావంతో మొన్ననే ఇతర పార్టీలలో ఉన్న తెలంగాణా య.యల్.ఏ.లు, యం.పీ.లకి వల విసిరాడు. అప్పుడు కూడా, ఎందుకయినా మంచిదని మునుపు గాలానికి తగిలించినట్లే మళ్ళీ తన వలకి కూడా ఎరలను తగిలించి మరీ విసిరేడు. “మా పార్టీలోకి రాదలచిన ఇతర పార్టీలలో ఉన్న తెలంగాణా య.యల్.ఏ.లు, యం.పీ.లకు ఇదే మా హృదయపూర్వక స్వాగతం” అనే బ్యానర్ తగిలించి విసిరిన ఆ వలకి, ఎవరయినా వచ్చి ఇర్రుకోదలిస్తే, ప్రస్తుతం వారు యేయే ప్రాంతాలనుండి గెలిచేరో వాళ్ళకి తే.ర.స. మళ్ళీ అవే స్థానాలు కేటాయించడమే గాకుండా వారి ఎన్నికల ఖర్చు మొత్తం పార్టీయే భరిస్తుందనే ఎరని కూడా తగిలించి విసరడం అయ్యింది.


ఇక, ఇప్పటికే ఎంతో కాలంగా తమ పార్టీలో పదవులు అనుభవిస్తున్నపటికీ తెలంగాణా ఉద్యమం పేరుతొ తే.ర.స.తో అంటకాగుతున్నవివిధ పార్టీల నాయకులనేకమంది ఇప్పుడు తే.ర.స. విసిరిన ఆ వలలోకి దూకినాదూకవచ్చును. తెలంగాణా సాధించాలనే బలమయిన కోరికకన్నా తమపార్టీలోనే ఉంటే, తెలంగాణా సమస్య తమ రాజకీయ జీవితాన్ని ఎక్కడ దెబ్బతీస్తుందోనని బయపడేవారే ముందు అటు వైపు దూక వచ్చును. అదీగాక, ఒక వేళ తే.ర.స. ఇటువంటి పండగ సీజన్(అఖిల పక్ష సీజన్లో) బంపర్ ఆఫర్ ఇస్తున్నపుడు వెళ్ళకుండా తాత్సారం చేస్తే, రేపు వెళ్ళదలుచుకొన్నా అక్కడ తమకి సీట్లు ఖాళీ ఉండవు గనుక అప్పుడు తమ పరిస్తితి రెంటికీ చెడ్డ రేవడి అవుతుందని అనుకొనే వారు కూడా ఇప్పుడు “త్యాగాలకి” సిద్దపడవచ్చును.


అప్పటికీ బయటకి రానివాళ్ళని ఏ విదంగా హ్యాండిల్ చేయాలో మన కెసిఆర్ గారికి అయన పార్టీవారికీ బాగాతెలుసు. నయాన్న పిలిచినప్పుడు రాకపోతే, బయ్యాన్నయిన పిలువక తప్పదు. తే.ర.స. కాకుండా బయట ఇతర పార్టీలలో ఉన్న వారందరూ కూడా తెలంగాణా ద్రోహులనే ట్యాగ్ ఒకటి వారికి తగిలించేస్తే కాగల కార్యం గందర్వులే చూసుకొoటారన్నట్లు వారిపని ఆ ట్యాగ్ తో పూర్తయిపోతుంది.


అయితే, కే.సిఆర్. నియంతృత్వ పద్దతుల గురించి, ఆయన తన సహచరులను ‘హ్యాండిల్’ చేసే విదానం గురించి తెలిసి కూడా ఎంతమంది దైర్యం చేసి అతను విసిరిన వలలోకి దూకుతారో మరిచూడాలి. మధ్యలోనే తెరాస కారు దిగివెళ్ళిపోయిన నరేంద్ర, వంటివారిని తే.ర.స. లో జేరదలిచిన వారు ముందుగా సంప్రదిస్తే ఎంతయినా ఉపయోగo ఉండవచ్చును.

 

ఏమయినప్పటికీ, అఖిలపక్ష సమావేశం ముగిసిన మరుక్షణం నుండే ఇతర పార్టీలలో ఉన్న తెలంగాణా య.యల్.ఏ.లు, యం.పీ.లపై ,ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారిపై అతని పార్టీ తీవ్ర ఒత్తిడి పెట్టబోతోoది. ఆ ప్రయత్నంలో, ముందుగానే ఈ విదంగా వల పరుచుకొని తే.ర.స. కూర్చొని ఉంది. మహా అయితే, అఖిలపక్షం ముగిసేవరకు అది ఓపిగ్గా కూర్చోని ఎదురుచూడవలసి ఉంటుంది. అప్పుడు చిన్న, పెద్ద చేపలన్నీ వాటంతట అవే వలలోకి రావచ్చును.


అఖిలపక్షంతో కాంగ్రెస్ తెలంగాణా ఎలాగు ఇచ్చేయబోదు గనుక, అప్పుడు ‘తెలంగాణా కోసం త్యాగాలు చేసేవారు’ తమ రాజకీయ భవిష్యత్తు కోసం కూడా కొంతయినా ఆలోచన చేయకమానరు గనుక, ముందే అటువంటి వారికి ఆహ్వాన పత్రికలు పంపితే వారు తమ పార్టీ ఉపదేశాలకి, అవి ప్రకటించ బోయే తాయిలాలకీ పడిపోకుండా నేరుగా తే.ర.స. వైపే నడుచుకొంటూ వచ్చేస్తారని తే.ర.స. అధ్యక్షులవారి ఆశ. మరి, ఇతర పార్టీలలో ఉన్న తెలంగాణా య.యల్.ఏ.లు, యం.పీ.లు ఈ బంపర్ ఆఫర్ స్వీకరిస్తారో లేక తెలంగాణా ద్రోహులుగా మిగిలిపోతారో చూడాలి మరి.