భూకబ్జాపై హైకోర్టు సీరియస్.. ఎమ్మెల్యేపై కేసు
posted on May 24, 2021 1:57PM
తెలంగాణలో మరో అధికార పార్టీ ఎమ్మెల్యే భు వివాదంలో చిక్కుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేపై కేసు కూడా నమోదైంది. భూ వివాదం కేసులో కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఉప్పల్ సుభాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ భూ వివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యేతో పాటు కాప్రా MRO గౌతమ్ కుమార్‌పై కూడా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
కాప్రాలోని సర్వే నెంబర్. 152లో 90 ఎకరాల భూ వివాదంలో ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి. భూ వివాదంలో ఎమ్మెల్యే సుభాష్ డబ్బులు డిమాండ్ చేశారని శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. పోలీసులకు కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో 1206,166A, 167, 168, 170, 171, 447, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు అయినట్టు పోలీసులు వెల్లడించారు.