రేవంత్‌ చెంత‌కు దానం నాగేంద‌ర్‌!.. కాంగ్రెస్‌లో చేరిక‌పై క్లారిటీ...

దానం నాగేంద‌ర్. ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ నేత‌. వైఎస్సార్ అనుచ‌రుడు. మాజీ మంత్రి. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బ‌ల‌మైన నాయ‌కుడు. అయితే, గులాబీ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం ద‌క్క‌క‌పోవ‌డంతో ఆయ‌న అసంతృప్తిగా ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా, రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ప్ర‌క‌టించ‌డంతో దానం పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని అంటున్నారు. ఒక‌ప్ప‌టి వైఎస్సార్ టీమ్ అంతా రేవంత్ వైపు అడుగుడులు వేస్తుండ‌టంతో.. అదే బాట‌లో దానం నాగేంద‌ర్ సైతం త్వ‌ర‌లోనే కాంగ్రెస్‌లో చేరుతారంటూ విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా, త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై స్వ‌యంగా దానం నాగేంద‌రే క్లారిటీ ఇచ్చారు. ఇంత‌కీ, ఆయ‌న ఏం చెప్పారు? టీఆర్ఎస్‌ను వీడుతున్నారా? మ‌ళ్లీ కాంగ్రెస్‌లో చేరుతున్నారా? రేవంత్‌రెడ్డితో చేతులు క‌లుపుతున్నారా?

దానం నాగేంద‌ర్ కాంగ్రెస్‌లో చేర‌బోతున్నార‌నే వార్త‌ల‌తో ఆయ‌న ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి ఆదేశాలు వ‌చ్చిన‌ట్టున్నాయి.. కొంప‌లు అంటుకుపోయిన‌ట్టు హ‌డావుడిగా దానం మీడియా ముందుకొచ్చి వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరేది లేద‌ని.. టీఆర్ఎస్‌లోనే ఉంటానంటూ ప్ర‌స్తుతానికైతే క్లారిటీ ఇచ్చారు. 

త‌న‌ చివరి శ్వాస ఉన్నంత వరకు టీఆర్ఎస్‌తోనే ఉంటాన‌ని.. విధేయతతో కేసీఆర్‌, కేటీఆర్ నాయ‌క‌త్వం కింద ప‌ని చేస్తాన‌ని.. దేవుడిపై ఆన అన్న రేంజ్‌లో గట్టిగా నొక్కి వ‌క్కానించారు దానం. తాను పార్టీ మారుతున్న‌ట్టు ప్ర‌చారం చేసిన వారిపై సైబ‌ర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాన‌న్నారు. సోషల్ మీడియాకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయంటూ సూక్తులు కూడా చెప్పారు. 

తెలంగాణలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరుగుతోందని.. తాను మంత్రిగా ఉండి కూడా చేయ‌లేనంత డెవ‌ల‌ప్‌మెంట్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో క‌నిపిస్తోంద‌ని అన్నారు. టీఆర్ఎస్ పార్టీయే చిరకాలం తెలంగాణలో ఉంటుందంటూ జోస్యం కూడా చెప్పారు. త‌న ఇంటికి ఎవరు వచ్చినా గులాబీ కండువా కప్పుకుని రావాల్సిందేన‌ని.. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో భవిష్యత్ లేదని.. టీఆర్ఎస్‌లో చిచ్చు పెట్టాలని చూసే వారికి పుట్టగతులు ఉండవంటూ శ‌పించేశారు కూడా.  

ఇంకా చాలానే అన్నారు దానం నాగేంద‌ర్‌.. కాంగ్రెస్‌లో త‌న‌కు చాలా అవమానాలు జరిగాయని.. కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్‌లోనే వందింతలు ఎక్కువ గౌరవం దొరుకుతోందంటూ పార్టీపై త‌నకున్న నిబ‌ద్ద‌త‌ను చాటుకునే ప్ర‌య‌త్నం చేశారు దానం నాగేంద‌ర్‌. ప‌నిలో ప‌నిగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపైనా పెద్ద ఎత్తున‌ విమ‌ర్శ‌లు గుప్పించారు. దానం తీరు చూస్తుంటే.. ఆయ‌న‌కు టీఆర్ఎస్ మీద ఉన్న ప్రేమకంటే.. కేసీఆర్ మీద ఉన్న భ‌య‌మే ఎక్కువగా క‌నిపిస్తోందంటున్నాయి కాంగ్రెస్ వ‌ర్గాలు. అయితే, దానం ప్ర‌స్తుతానికి తాను కారు పార్టీలోనే ఉంటాన‌ని చెబుతున్నా.. ఏ క్ష‌ణంలోనైనా ఆయ‌న ర‌న్నింగ్ కారు దిగేసి.. రేవంత్‌రెడ్డి చేయి ప‌ట్టుకునే ఛాన్స్ లేక‌పోలేదనే వాద‌నా వినిపిస్తోంది. గ‌తంలో సైతం ఆయ‌న రాత్రికి రాత్రి వైఎస్సార్‌ను వీడి టీడీపీలో చేరిన చ‌రిత్ర‌ను గుర్తు చేస్తున్నారు. ఆనాడు తాను ఎమ్మెల్యేగా గెలిచినా.. టీడీపీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్‌లో చేర‌డం.. ఉప ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం.. వైఎస్సార్ ఆశీస్సుల‌తో మంత్రి కావ‌డం.. ఇలా దానం చ‌రిత్ర అంతా త‌వ్విపోస్తున్నారు. అధికారం ఉన్న‌చోటే దానం నాగేంద‌ర్ ఉంటార‌ని.. రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అవుతార‌ని భావిస్తే.. ఆయ‌న ఏ క్ష‌ణంలోనైనా మ‌న‌సు మార్చుకోవ‌చ్చ‌ని అంటున్నారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu