36 బస్సుల సీజ్ తో ప్రక్షాళన జరిగిపోతుందా?

రాష్ట్రంలో అక్రమంగా నడుపుతున్న 36 బస్సులను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. వాటిలో 15 బస్సులు కాలేశ్వరి ట్రావెల్స్ కు సంబంధించినవి. 91 బస్సుల యజమానులపై కేసు పెట్టారు. కాలేశ్వరి ట్రావెల్స్ కు చెందిన బస్సు షిర్డీ వెళ్ళేదారిలో ప్రమాదం జరగటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పందించిన రవాణాశాఖాధికారులు ప్రక్షాళనకు నడుంబిగించారు. దీనిలో భాగంగా తమకు అనుమానం వచ్చిన అనేక అంశాలపై ఇంకా విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగా ప్రై'వేటు' యజమానుల అక్రమాలకూ అద్దం పట్టే సాక్ష్యాలను వెదికి పట్టుకుంటున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో అక్రమంగా తిరుగుతున్నా వాహనాల కింద లెక్కకు వచ్చిన 91 బస్సుల యజమానులపై కేసులు నమోదు చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 36 బస్సులను సీజ్ చేశారు. వీటిలో 25 బస్సులు హైదరాబాద్ కు చెందినవే కావటం గమనార్హం. విశాఖపట్నంలో నాలుగు బస్సులను కూడా సీజ్ చేశారు. హైదరాబాద్ లో సీజ్ చేసిన బస్సులను ఖైరతాబాద్ లోని ఆర్తీఎ కార్యాలయానికి తరలించారు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద మూడు ప్రైవేటు బస్సులను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 

 

హైదరాబాద్ ఎల్బీనగర్ చెక్ పోస్ట్ వద్ద 12, శంషాబాద్ షాపూర్ చెక్ పోస్ట్ వద్ద 5 బస్సులను సీజ్ చేశారు. ప్రతీ ఏటా వందకోట్ల రూపాయలు పన్నుగా చెల్లించే తమను మీడియా మాఫియాగా చిత్రీకరించటం తగదని ప్రైవేటు ఆపరేటర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. మీడియాకు వ్యతిరేకంగా ఈ సంఘం నినాదాలు చేసింది. హైదరాబాద్ లో కొందరు పత్రికాప్రతినిథులను బెదిరించేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో దుడుకుగా వ్యవహరించిన ప్రయివేటు ఆపరేటర్లను పోలీసులు అదుపు చేశారు. షిర్డీ వెళ్ళే బస్సుకు ప్రమాదం జరగడానికి డ్రైవర్ నిర్లక్షమే కారణమని ఆందోళనల నేపథ్యంలో రవాణాశాఖ డ్రైవింగ్ పై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. మూడు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించి ఆ తరువాత పరీక్ష పెడతారు. దీనిలో పాసైతే ఫర్వాలేదు కానీ, లేకపోతే మళ్ళీ పరీక్ష కూడా తప్పదు. ఈ పరీక్షలో పాసైతేనే డ్రైవర్ ను వాహనం నడపటానికి అనుమతి ఇస్తారు. ఇదిలా ఉండగా పాఠశాలలు వాడుతున్న బస్సుల ఫిట్ నెస్ కూడా పరీక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అసలు లైసెన్సు లు కూడా లేకుండా పాఠశాలల బస్సులు నడుపుతున్నారని ఆరోపణలున్నాయని రవాణా అధికారులకు తెలిపారు. ఫిట్ నెస్ లేని స్కూలు బస్సులను రోడ్డుదీడకు వదలకుండా కఠినచర్యలు తీసుకోవాలన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu