"మూడవ" జాతికి గౌరవం పెంచేందుకు..?

వాళ్లు మగవాళ్లు కాదు..అటు ఆడవాళ్లు కాదు..మగవారిగా పుట్టి ఆడవారిగా మారిన వారు. మగతనం మచ్చుకైనా కనిపించకుండా వొంటినిండా ఆడతనం కప్పేసుకున్న మగాళ్లు..కొన్ని చోట్ల వీరిలో ఆడవాళ్లు కూడా ఉంటారు. వీరిని వాళ్లను కన్న కుటుంబాలే గెంటేస్తాయి. మీరు మా మనుషులు కాదు పొమ్మంటాయి. ఇక సమాజం గురించి చెప్పేదేముందీ..అంతకన్నా ఛీ కొడుతుంది..మా సంస్కృతి, సంప్రదాయాల్లో ఇలాంటి వ్యవహారమే లేదు వెళ్లమంటోంది. ఈ జీవిత పోరాటంలో ఈ "మూడో తరగతి" మనుషుల ఆగచాట్టు ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడికెళ్లినా చీదరింపులు..చీత్కరాలు అయినా విధిరాతను ఎదిరించి బతుకిడుస్తున్నవారు కోకొల్లలు ఇలాంటి వారి సంక్షేమాన్ని పట్టించుకునే నాధుడు లేడు.

 

కాని దేశవ్యాప్తంగా పలు ట్రాన్స్‌జెండర్స్ సంఘాల పోరాట ఫలితంగా కేంద్రప్రభుత్వం దిగివచ్చింది. ట్రాన్స్‌జెండర్స్‌ సంక్షేమాన్ని "సాంఘిక న్యాయం, సాధికారత శాఖ"కు అప్పగిస్తూ కేంద్రం నిబంధనలను మార్చింది. వీరిపై సామాజిక వేధింపులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో వీరి కోసం "కొత్త జాతీయ పాలసీ"ని ఈ మంత్రిత్వశాఖ రూపొందించనుంది. "ట్రాన్స్‌జెండర్స్ హక్కుల బిల్లు-2015' ప్రకారం వీరిని ఇతరులు అని కాకుండా ట్రాన్స్‌జెండర్స్ అనే పిలవాలి. కేవలం ప్రభుత్వం ఒక్కటే కాదు వీరిపై సమాజం కూడా కాస్త ఆలోచించాలి. తనకు తాను మానవత్వానికి ప్రతీకగా చెప్పుకుంటుంది ఈ సమాజం. దానిలోంచి కాస్త జాలి, మరికాస్త ప్రేమాభిమానాలను వీరిపై చూపడం వల్ల ఆ మానవత్వానికి మరింత విలువ వస్తుంది. సో.. మనవంతుగా వారికి చేయూతనివ్వడం మన ధర్మం.