"సరదా"లు సద్దేసుకోండి..లేదంటే..!

ఫ్లాస్మా టీవీ కొనాలనుకుంటున్నారా..వైఫె సేవలు పొందాలనుకుని స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..ఏసీ గాలులతో సేద తీరాలనుకుంటున్నారా..? కుటుంబంతో కలిసి సినిమా చూసి ఏ హోటల్‌లోనే డిన్నర్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ రెండు రోజుల్లోనే..ఎందుకంటే ఎల్లుండి నుంచి మరో సెస్ బాదుడు బిగెన్ కాబోతోంది. దేశంలో రోజు రోజుకు దిగజారిపోతున్న ఆర్థికపరిస్థితిని చక్కదిద్దుతానంటూ మాటలు వల్లిస్తున్న మోడీ సర్కార్ పన్నుల మీద పన్నులు వేసి ఈ ఏడాదిని పన్నుల సీజన్‌గా మార్చేసింది. ఇప్పటికే వివిధ రకాల సెస్‌లు, సర్‌ఛార్జ్‌ల పేరిట వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ప్రజలపై భారం వేస్తూ వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం. మరో సెస్‌ బాదుడుకు రెడీ అవుతోంది.

 

దేశంలోని అన్నదాతల సంక్షేమం కోసం కృషి కళ్యాణ్ సెస్ పేరిట 0.5 శాతం సెస్ కలెక్ట్ చేయాలని బడ్జెట్‌లో ప్రకటించారు. దానిని జూన్ 1 నుంచి అమలు చేయనున్నారు. దీని వల్ల టెలిఫోన్ నుంచి రైలు ప్రయాణం వరకు, ఉప్పు నుంచి పప్పు వరకు, మంచినీళ్ల నుంచి మద్యం వరకు, రెస్టారెంట్లలో టిఫిన్ నుంచి భోజనం వరకు ఇలా పన్ను పరిధిలోకి వచ్చే అన్ని సేవలపై కృషికళ్యాణ్ సెస్‌ను వసూలు చేస్తారు. దీని వల్ల ఇప్పటి వరకు 14.5 శాతంగా ఉన్న సేవాపన్ను 15 శాతానికి చేరుతుంది. దీని ఆదాయ లక్ష్యం 5,000 కోట్ల రూపాయలు. కృషి కళ్యాణ్ సెస్ వల్ల అంతిమంగా భారం పడేది సామాన్యుడిపైనే. సో ఇలాంటి సరదాలు ఏమైనా ఉంటే ఇవాళ, రేపటిలోగా తీర్చేసుకోగలరు.