విశాఖ కలెక్టర్ పై బదలీ వేటు!
posted on Apr 30, 2025 3:34PM

సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న అపశ్రుతిలో ఏడుగురు భక్తులు మరణించిన ఘటనపై మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు అధికారులపై ఫైర్ అయ్యారు. గోడకూలి ఏడుగురు మరణించిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదే సమయంలో సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించారంటూ అధికారులపై నిప్పులు చెరిగారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఎవరి నిర్లక్ష్యం ఉంది? చేసిన ఏర్పాట్లు ఏంటి? అన్న విషయాలపై ఆరా తీశారు. గత ఏడాది కంటే.. ఈ సారి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిసినా నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారంటూ నిలదీశారు.
ఈ క్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఏర్పాట్లకు సంబంధించి ఎన్ని సార్లు సమీక్షించారని ప్రశ్నిం చారు. అయితే కార్పొరేషన్ ఎన్నికల వ్యవహారంలో తీరిక లేకుండా ఉన్న తాను సింహాచలంపై పెద్దగా దృష్టి పెట్టలేదన్న ఆయన సమాధానంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ ను వెంటనే బదిలీ చేయాలని సీఎస్ ను ఆదేశించారు. అలాగే హోంమంత్రి అనితపైనా ఆగ్రహం వ్యక్తం చే శారు. ఏర్పాట్లపై సమీక్షించారా అని నిలదీశారు. కూలిన ఆ గోడ కట్టిన కాంట్రాక్టర్ పైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని విషయాలపై తనకు మూడు రోజులలోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.