పహల్గాం ఉగ్రదాడి.. పార్టీల మధ్య పోస్టర్ వార్!

పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాని కదిల్చి వేసింది. కుల, మత, ప్రాంత, రాజకీయ విభేదాలకు  అతీతంగా ప్రజలందరూ ఉగ్రదాడిని ఖండిస్తున్నారు.  పాకిస్థాన్ దుశ్చర్యను ప్రపంచ దేశాలు సైతం ఖండిస్తున్నాయి. మన దేశానికి మద్దతు ప్రకటిస్తున్నాయి. దేశంలోనూ ఎక్కడిక్కడ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా స్వచ్చందంగా ప్రజలు ర్యాలీలు నిర్విహిస్తున్నారు.ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తున్నారు.పాకిస్థాన్ కు గట్టిగా బుద్ది చెప్పాలని,కఠిన చర్యలు తీసుకోవాలని కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ప్రతి భారతీయ హృదయం ప్రతీకారంతో రగిలి పోతోంది. ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా 140 కోటల మంది భారతీయులు ఒక్కటిగా నిలుస్తారని, భరోసా ఇస్తున్నారు.   

అయితే.. ఇంతలోనే  పహల్గాం ఉగ్రదాడిపై రాజకీయ రాక్షస క్రీడ మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మొదలైన మాటల యుద్ధం ఉగ్రరూపం దాల్చింది. పోస్టర్ వార్ కు తెర తీసింది. కాంగ్రెస్‌ పార్టీ  తలలేని ప్రధాని’ పోస్టర్‌ ను  ఎక్స్ లో పెట్టడంతో రాజకీయం వేడెక్కింది. దీనిపై  దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆ పోస్టర్‌ను తొలగించింది. అయితే, కాంగ్రెస్ పోస్ట్ చేసిన పోస్టర్ దానికింద పెట్టిన ‘గయాబ్’ కాప్షన్’ పై బీజేపీ తీవ్రంగా  మండి పడింది. రాహుల్‌గాంధీ పాకిస్థాన్‌ మిత్రుడంటూ బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌పీ సింగ్‌ ట్వీట్‌ చేయడమేగాక..వీపు వెనుక కత్తి దాచుకుని ఉన్న రాహుల్‌ చిత్రాన్ని పోస్టు చేశారు. మరో వంక కాంగ్రెస్ పెట్టిన పోస్టును పాకిస్థాన్‌ మాజీ మంత్రి ఫవాద్‌ చౌదరి రీట్వీట్‌ చేశారు. అగ్నికి ఆజ్యం తోడైంది. బీజేపీ కాంగ్రెస్ పై  విరుచుకుపడింది. 
పహల్గాం ఉగ్ర ఘటన తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో ప్రధాని పాల్గొనక పోవడంపై కాంగ్రెస్‌ తరచూ విమర్శలు చేస్తోంది. ఆ క్రమంలోనే తాజా పోస్టర్‌ను పోస్టు చేసింది. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో స్పందించింది. కాంగ్రెస్‌ సంపూర్ణంగా పాకిస్థాన్‌కు మద్దతిస్తోందని.. ఆ పార్టీని ‘లష్కరే పాకిస్థాన్‌ కాంగ్రెస్ గా అభివర్ణించింది.

అఖిల పక్ష సమావేశంలో ఐక్యత గురించి నొక్కిచెప్పిన  కాంగ్రస్  పార్టీ నేతలు పాక్‌తో చర్చలు జరపాలంటున్నారని ఆక్షేపించింది. తలలేని మొండెం.. ఆ పార్టీ ఉగ్ర సిద్ధాంతంగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. “రాహుల్‌గాంధీ ఆదేశాలతోనే ఆ పోస్టు పెట్టారు. దీనిని చూసి దేశం సిగ్గుపడుతోంది. క్లిష్ట సమయంలో భారత్‌ను బలహీనపరిచేందుకు లష్కరే పాకిస్థాన్‌ కాంగ్రెస్‌ చేసిన ప్రయత్నమిది అని భాటియా విమర్శించారు. తలలేని మొండెం ఉగ్రవాద నినాదమని.. ఆ పార్టీ పోస్టర్‌ దానినే ప్రతిబింబిస్తోందన్నారు. ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తిపరచడానికే కాంగ్రెస్‌ తలలేని మొండెం చిత్రాన్ని పోస్టుచేసిందని బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ ‘ఎక్స్‌’లో ఆరోపించారు. ఈ వివాదంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ స్పందించారు.‘‘పార్లమెంటు చర్చల్లో ప్రధాని పాల్గొని పహల్గాం ఘటన తదనంతర పరిణామాలపై వివరణ ఇవ్వాలని కోరాం.ఇందులో రాజకీయ ఎజెండా ఏమీ లేదు. ఐక్యతే కాంగ్రెస్‌ ఫార్ములా అని స్పష్టం చేశారు.

నిజానికి పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపధ్యంగా, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  మొదలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య,ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్ వాద్రా, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తదితరరులు చేసిన వ్యాఖ్యల ఆధారంగా, సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ పాక్ అనుకుల పార్టీ అనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో  కాంగ్రెస్ పెట్టిన పోస్టును పాక్ నాయకులు రీట్వీట్ చేయడం కాంగ్రెస్ పార్టీని గట్టిగానే డ్యామేజి చేసింది. అందుకే  కాంగ్రెస్ పార్టీ ఎక్స్’ నుంచి పోస్టును ఉపసంహరించుకోవడమే  కాకుండా,  పార్టీ జనరల్ సెక్రటరీ, పహల్గాం ఉగ్రదాడి కి సంబందించి పార్టీ లైన్. దాటి వ్యాఖ్యలు, విమర్శలు చేయవద్దని నాయకులను ఆదేశించారు. 

ఈ పోస్టర్‌పై కాంగ్రెస్‌ నాయకుల్లోనే విభేదాలు తలెత్తినట్లు సమాచారం. పార్టీ వైఖరికి భిన్నమైన పోస్టరుకు అనుమతించినందుకు పార్టీ సోషల్‌ మీడియా విభాగం సారథి సుప్రియ శ్రీనతేను కాంగ్రెస్‌ అధిష్ఠానం మందలించిందని, తక్షణం పోస్టరు తొలగించాలని ఆదేశించిందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. నిజానికి, పహల్గాం ఉగ్రదాడి కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే హిందూ వ్యతిరేక, ముస్లిం అనుకూల పార్టీగా ఆరోపణలు ఎదుర్కుంటున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడుకుడితిలో పడ్డ ఎలుకల మారిందని, విశ్లేషకులు అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu