జగన్ గాలిమాటలు.. ఏపీలో కాగ్ కల్లోలం.. ఈటల రిటర్న్‌గిఫ్ట్.. టాప్‌న్యూస్ @ 7pm
posted on Nov 26, 2021 5:46PM
1. జగన్‌రెడ్డి అన్నీ గాలిమాటలు మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి వారు ఉంటారనే ఆనాడు అంబేడ్కర్ రాజ్యాంగం రాశారన్నారు. సీఎం గాల్లో వచ్చారు.. గాల్లోనే వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్టి అప్పు తెచ్చుకుంటారని విమర్శించారు. సీఎంకు అనుభవం లేదు, అహంభావం మాత్రం ఉందని చంద్రబాబు విమర్శించారు.
2. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డిలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వెంటనే భూపేష్ రెడ్డికి జమ్మలమడుగు పార్టీ భాద్యతలను అప్పగించారు. జమ్మలమడుగు టీడీపీకి కంచుకోట అని.. వలస పక్షులకు ఇక పార్టీలో అవకాశం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈసారి పని చేసే వారికి మాత్రమే పార్టీలో పదవులని స్పష్టం చేశారు.
3. ఏపీలో ఆర్థిక నిర్వహణకు అసలు బడ్జెట్‌కు పోలిక లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్ రిపోర్ట్ తేల్చిచెప్పింది. శాసనసభను లెక్కలోకి తీసుకోకుండా పద్దులు నిర్వహిస్తున్నారని తప్పుబట్టింది. "2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ పద్దులను వ్యయం చేసి, ఆ తర్వాత జూన్ 2020లో శాసనసభలో ప్రవేశ పెట్టారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవహారాలు చోటు చేసుకున్నాయి".. అంటూ కాగ్ నివేదిక స్పష్టం చేసింది.
4. జగన్ పాలనలో అభివృద్ధి కంటే వ్యాపార ఛాయలు ఎక్కువయ్యాయని బీజేపీ నేత లంకా దినకర్ ఆరోపించారు. కొత్త విధానాలతో దండుకోవడంలో జగన్ స్పెషలిస్ట్ అని వ్యాఖ్యానించారు. పేదలకు నవరత్నాలు అంటూ నెత్తిన నవశఠగోపాలు పెడుతున్న దందాల ప్రభుత్వం అయ్యిందంటూ లంకా దినకర్ విమర్శించారు.
5. ఆదిలాబాద్ జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిని తానే పోటీలో పెట్టించానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ఉండాలని.. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ఉండాల్సిందన్నారు. కరీంనగర్‌లో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ కోల్పోతుందని ఈటల జోస్యం చెప్పారు.
6. న్యాయవ్యవస్థను పరిరక్షించడంలో న్యాయమూర్తులకు న్యాయవాదులు సహకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ కోరారు. ఉద్దేశపూర్వక దాడుల నుంచి న్యాయవ్యవస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులదే అని తెలిపారు. నిజం వైపు నిర్భయంగా నిలబడటం సహా తప్పును అంతే స్థాయిలో ఖండించాలన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో సీజే రమణ పాల్గొన్నారు.
7. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందు వరసలో కూర్చున్న ఎంపీ రఘురామను ముందుగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలకించారు. ఆ తరువాత అటుగా వచ్చిన ప్రధాని మోదీ.. రఘురామకృష్ణరాజును పేరు పెట్టి పిలిచి కొంచెం సేపు నిలబడి భుజం తట్టి వెళ్లారు.
8. ఆడబిడ్డలను రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారని టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత మండిపడ్డారు. ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తున్న మహిళలను పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని దాడులు చేయించడం, కేసులు పెట్టడం చూస్తుంటే.. ఇది సైకో ప్రభుత్వమని చాలా సందర్భల్లో రుజువైందన్నారు. క్యారెక్టర్ లేని వెధవలు భువనేశ్వరిని దూషిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో టీడీపీ మహిళ నేతలపై పోలీసులతో దాడులు చేయించారని, వాళ్లను భయభ్రాంతులకు గురిచేసి, వ్యాపారాలపై దెబ్బకొట్టడానికి సిగ్గు అనిపించడంలేదా? అని అనిత ప్రశ్నించారు.
9. వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అనుమానితుడు శివశంకర్ రెడ్డిని సీబీఐ బృందం విచారిస్తోంది. పులివెందుల కోర్టు అనుమతితో రిమ్స్ ఆసుపత్రి నుంచి సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. వివేకా హత్యకేసులో.. శివశంకర్ రెడ్డి పాత్రపై డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలంలో ప్రస్తావించిన విషయాలపై సీబీఐ బృందం ఆయనను క్షుణ్ణంగా ప్రశ్నిస్తోంది.
10. అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి పుట్టపర్తిలో చేదు అనుభవం ఎదురైంది. పుట్టపర్తిలో ముంపు బాధితులను పరామర్శించేందుకు కలెక్టర్ వచ్చారు. కలెక్టర్‌ను సాయినగర్ కాలనీ వాసులు అడ్డుకున్నారు. వర్షాల కారణంగా నష్టపోయిన తమను ఆదుకోవడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీవాసులు నిలదీయడంతో కలెక్టర్ నాగలక్ష్మి ఉక్కిరిబిక్కిరి అయ్యారు.