చంద్రబాబు కన్నీటి శాపం, కార్యకర్తల ఆత్మహత్యాయత్నం, జగన్‌కు మోదీ ఫోన్.. టాప్‌న్యూస్
posted on Nov 19, 2021 6:09PM
1. అప్పుడు తన తల్లిని దూషించారు.. ఇప్పుడు తన భార్య విషయం తీసుకువచ్చి అవమానించారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. కన్నీరు ఆగక ప్రెస్‌మీట్‌లోనే భోరున విలపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తన తల్లిని దూషిస్తే.. తాను గట్టిగా వైఎస్‌ను ప్రశ్నించానన్నారు. దీంతో తప్పు జరిగింది.. క్షమించమని అడిగారన్నారు. ఇవాళ వైసీపీ నేతలు నీచ రాజకీయాల కోసం తన భార్యను లాగే ప్రయత్నం చేశారన్నారు. ఈ కౌరవ సభ.. గౌరవం లేని సభ అంటూ మండిపడ్డారు చంద్రబాబు.
2. స్పీకర్ తమ్మినేని సీతారాం తన ప్రవర్తనపై ఆలోచించుకోవాలన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. "మాట్లాడుతుండగానే నా మైక్ కట్ చేశారు. గౌరవంగా బతికేవాళ్లను కించపరుస్తున్నారు. 40 ఏళ్లు పనిచేసింది.. ఇలా అవమానపడటానికా? అని బాధపడుతున్నా. అవతలివారు బూతులు తిడుతున్నా.. సంయమనం పాటిస్తున్నా. నాకు బూతులు రాక.. తిట్టలేక కాదు.. అది మా విధానం కాదు." అని చంద్రబాబు అధికార పక్షంపై విరుచుకుపడ్డారు.
3. శాసనసభలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించారు. ఆ సమయంలో తాను సభలో తాను లేనని చెప్పారు. సభకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలేంటో తెలుసుకున్నానన్నారు. తాను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారని, చంద్రబాబు ప్రస్టేషన్‌లో ఉన్నారని అన్నారు.
4. కుటుంబ సభ్యులను కించపరచటం తగదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడారని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు కంటతడి పెట్టడం బాధాకరమని అన్నారు. ఏపీలో చోటుచేసుకుంటున్న రాజకీయ వైపరీత్యాలు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయని పవన్ తెలిపారు. ఒక పక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే ప్రజాప్రతినిధులు ఇవేమి పట్టనట్టు ఉన్నారని పవన్ విమర్శించారు.
5. వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శలు గుప్పించారు. వ్యక్తిగతంగా విమర్శించే హక్కు ఏ ఒక్కరికి లేదని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిపై ఇన్ని అబాండాలు వేస్తుంటే సీఎం జగన్ వెకిలి నవ్వులు నవ్వుతున్నాడని సునీత మండిపడ్డారు. అలాంటి మాటలు మాట్లాడే వారిని చెప్పుతో కొట్టాలంటూ టీడీపీ నేత అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
6. చంద్రబాబు, లోకేశ్‌లు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో యువకులు, కార్యకర్తలు మోకాళ్లపై కూర్చుని అంతా నీ వెంట ఉంటామంటూ చంద్రబాబుకు మద్దతు పలికారు. "సిద్ధం సిద్ధం.. పోరాటానికి సిద్ధం.. అంతా నీ వెంటే.. మేమంతా నీవెంటే.." అంటూ నినాదాలతో హోరెత్తించారు.
7. అనంతపురంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు బంగినాథ, విశ్వేశ్వరనాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ ఘటన జరిగింది. చంద్రబాబు కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలుస్తోంది.
8. వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ వర్గీయులు అరాచకం సృష్టించారు. జడ్పీటీసీ ఎన్నికలో ఓటమితో దాడులకు దిగారు. శావల్యాపురం జడ్పీటీసీ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. దీంతో దాడులకు తెగబడ్డారు. టీడీపీ వర్గీయుల ఇళ్లపై రాళ్లు, మద్యం సీసాలతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. మహిళలు, చిన్నారులు భయభ్రాంతులకు గురి చేశారు.
9. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పీఎం మోదీ.. సీఎం జగన్‌కు ఫోన్ చేశారు. కొనసాగుతున్న సహాయక చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఏపీకి అన్ని విధాలుగా సాయమందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
10. కడప జిల్లా రాజంపేట వరదల్లో 12 మంది జల సమాధి అయ్యారు. వరద ప్రవాహానికి అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట తెగిపోయింది. చెయ్యేరులోకి వరద ప్రవాహం పెరిగింది. నది దాటుతున్న ఆర్టీసీ బస్సు వరదలో మునిగిపోయింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కొందరు ప్రయాణికులు బస్ టాప్‌పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. చిత్తూరు జిల్లాలోనూ భారీగా వానలు కురుస్తున్నాయి. తిరుమల కొండపైన వరద బీభత్సం నెలకొంది. తిరుపతి నగరంలో అనేక కాలనీలు నీట మునిగాయి.