ఉక్కుమనిషే విలవిలా ఏడిస్తే? ఆ కన్నీటి పవర్ ఎంతో తెలుసా?
posted on Nov 19, 2021 4:53PM
నారా చంద్రబాబు నాయుడు. 70ఏళ్లు దాటిన నవ యువకుడు. 40 ఏళ్ల రాజకీయ ఉద్దండుడు. దేశ రాజకీయాల్లోనే మేరుపర్వతం లాంటి నాయకుడు. మంచి, మర్యాద.. సహనం, సంస్కారం, హుందాతనం.. ఇలాంటి లక్షణాలన్నీ కలగలిసిన విలక్షణ నేత. మిస్టర్ క్లీన్, మిస్టర్ పర్‌ఫెక్ట్. ఆయనలా ఈయనది ఫ్యాక్షన్ రక్తం కాదు. అరాచక మనస్తత్వం అంతకన్నా కాదు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నమ్మి, ఆచరించిన పార్టీ అది. అలాంటి చంద్రబాబు అంతలా భావోద్రేగానికి గురికావడం మామూలు విషయం ఏమాత్రమూ కాదు. ఇది వైసీపీ నేతల దుర్మార్గానికి పరాకాష్ట. అధికార పార్టీ ఉన్మాదానికి ప్రతీక.
విశాఖపై హుద్‌హుద్ విరుచుకుపడినా లెక్క చేయక.. తుఫానుకు ఎదురొడ్డి ధీటుగా నిలిచిన గుండెధైర్యం ఆయనది. అలిపిరిలో ల్యాండ్‌మైన్స్ పేలినా.. అదరకుండా.. బెదరకుండా.. దుమ్ము దులిపేసుకుంటూ నడిచివచ్చిన నిలువెత్తు సాహసం ఆయనది. అలాంటి ధైర్యశాలి ఇప్పుడింతలా.. చిన్నపిల్లాడిలా.. వెక్కి వెక్కి ఏడ్వడం.. తెలుగుజాతి ఇంతకు ముందెప్పుడూ చూడని బాధాకర దృశ్యం. కేవలం దృశ్యం కాదది.. అంతకుమించి విషాదం.. దారుణం.
ఉమ్మడి రాష్ట్రంలో 40 సీట్ల దగ్గరే ఆగిపోయినా అలసిపోలేదు. నిండు అసెంబ్లీలో వైఎస్సార్ తన తల్లిని కించపరిచేలా మాట్లాడినా చెదరలేదు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినా వెరవలేదు. నవ్యాంధ్రను సన్‌రైజ్ స్టేట్‌గా వెలిగేలా చేశారు. కేంద్రం ద్రోహం చేసినా.. ధర్మ పోరాటమే చేశారు కానీ ఎక్కడా దారి తప్పలేదు. రెండేళ్ల క్రితం 23 సీట్లతో ఓడిపోయినా అదరలేదు. కేసులు, కుట్రలతో పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నా.. తనపై, తన కొడుకుపై కేసులు కడుతున్నా.. ఆఖరికి తన ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడినా.. టీడీపీ కార్యాలయంపై వైసీపీ మూక దాడి చేసి విధ్వంసం చేసినా.. బెదరకుండా.. తొణగకుండా.. నిటారుగా నిలబడ్డారు. ఎదురుదాడే చేశారు కానీ.. ఇంతకు ముందెప్పుడూ.. ఇలా కన్నీరు కార్చలేదు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు భోరున విలపించడం.. అధికార పక్ష రాజకీయ పతనానికి నిదర్శనం. స్పందించే గుణం, చలించే తత్వం, ఖండించలేని మేధావితనం.. మూకుమ్మడిగా చచ్చిన నేల మీద రాలిన బొట్టు… చంద్రబాబు కార్చిన ఆ కన్నీరు.
చంద్రబాబు ఉక్కుమనిషి అని గుర్తెరిగే.. గురి చూసి ఆయన వీక్‌నెస్ మీద కొట్టారు. తినేది పిడికిలంత. ధరించేది ఒక జత. ఎలాంటి హంగు-ఆర్భాటం లేదు.. ఆస్తులకై వెంపర్లాట అసలే లేదు. గతమంతా ప్రజలకే అంకితం. భవిష్యత్తంతా రాష్ట్రానికే సొంతం. పని తప్ప మరో ధ్యాస లేదు. తెలుగు జాతి కోసమే ఆయన జీవితం. తమ్ముళ్లే వారసులు. కుటుంబ సభ్యులే ఆస్తిపాస్తులు. అందుకే, చంద్రబాబు ఆయువు పట్టులాంటి ఆయన కుటుంబం పరువు మర్యాదలపై దెబ్బకొట్టింది వైసీపీ. ఎన్ని దెబ్బలు కొట్టినా.. గోడకు కొట్టిన బంతిలా తిరుగొస్తున్నాడనే అక్కస్సుతో.. చంద్రబాబు ఫ్యామిలీ ఇమేజ్‌ను టార్గెట్ చేశారు దుర్మార్గులు. అర్థనారీశ్వరుడులాంటి చంద్రబాబుకు.. భార్య భువనేశ్వరే సర్వస్వం. ప్రాణంకంటే ప్రియం. అందుకే ఆమెపై ఈ దాడి కావొచ్చు. అంతలా అవమానించినా.. ప్రెస్‌మీట్ పెట్టి భోరున ఏడ్చారే కానీ.. కన్నీరు తుడుచుకున్నారే కానీ.. తిరిగి ఎలాంటి అవహేళనలు చేయలేదు. జగన్ భార్యనో, అంబటి అర్థాంగినో, కొడాలి ఇంటి ఆవిడనో.. కించపరచలేదు. అదీ చంద్రబాబు సంస్కారం. కానీ, కుసంస్కారులకు ఈ విషయం తలకెక్కేనా? సిగ్గులేని జాతికి.. వేల కోట్లు దోచుకున్నా.. సీబీఐ, ఈడీ కేసులున్నా.. ఏళ్ల పాటు జైల్లో మగ్గినా.. అదేమంత పెద్ద విషయం కాకపోవచ్చు. హుందాగా బతికే నాయకుడికి.. పరువే ప్రాణంగా మసులుకునే నేతకి.. తన ఇంటి వారిని పళ్లెత్తు మాట అన్నా.. ఇలానే వెక్కి వెక్కి ఏడుస్తారు. కన్నీటికి ఎంతో విలువ ఉంటుంది.
చంద్రబాబుకు భవిష్యత్తును ఊహించగల విజన్ ఉంది. ఆయన చెప్పింది ప్రతీదీ నిజం అయింది. జగన్‌కు ఒక్కఛాన్స్ ఇస్తే రాజధాని ఉండదు అని చెప్పినప్పుడు ఎవరూ నమ్మలా. అరాచకం రాజ్యమేలుతుంది అన్నప్పుడూ తలకెక్కలా. మీ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి అని చెప్పినప్పుడూ తెలుసుకోలా. రాష్ట్రం సర్వనాశనం అవుతుంది మీ ఇష్టం అంటూ చేతులెత్తి మొక్కనప్పుడు మెదడుకు చేరలా. రెండేళ్లుగా అవన్నీ నిజం అని రుజువు అయ్యాయ్. అవుతున్నాయ్.
పిల్లినైనా.. పులినైనా.. కార్నర్ చేసి టార్చర్ చేస్తే ముందు కన్నీరే వస్తుంది. ఆ తర్వాతే అసలు అటాక్ మొదలవుతుంది. కరుడుకట్టిన పోరాటానికి నాంది పడుతుంది. ఇప్పుడదే సమయం ఆసన్నమైంది. చంద్రబాబు కంట కారిన ఆ ఆఖరి బొట్టే.. జగన్ ప్రభుత్వ వినాశనానికి తొలిమెట్టు. కన్నీటికి ఉన్న శక్తి అలాంటిది. రాసిపెట్టుకో జగన్.. నవంబర్ 19.. చంద్రబాబుతో కన్నీరు పెట్టించిన రోజు.. వైసీపీ ప్రభుత్వ పతనానికి పునాది పడిన రోజు. నిండు సభలో చంద్రబాబు శపథం చేసినట్టు.. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఆయన ఆ అసెంబ్లీలో అడుగుపెట్టేది.. చంద్రబాబు కార్చిన ప్రతీ కన్నీటి చుక్కకూ.. శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉండు జగన్.. ఎనీ డౌట్స్..?