ఉల్లి బాటలో పయనమవుతున్న టమాటా ధరలు....
posted on Oct 5, 2019 11:23AM

కూరల్లో ప్రతి సగటు మనిషి నిత్యం వాడేది కూర టమాటా.ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా కూరగాయల ధరల మంట మొదలైంది. ఉల్లిగడ్డలతో అంటుకున్న సెగ టమాటాలూ ఇతర కూరగాయలకు పాకింది. బోయినిపల్లి మార్కెట్ లో కిలో టమాటాల ధర అరవై రూపాయలకు చేరింది. సరిగ్గా వారం క్రితం కిలో టమాటా పది రూపాయల లోపు ఉంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో తోటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాయ పూత రాలిపోయి ఒక్కసారిగా దిగుబడి పడిపోయింది. దీంతో ఇతరప్రాంతాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. కూరగాయలపై మచ్చలు ఏర్పడి నాణ్యత పూర్తిగా తగ్గిపోయింది. జంటనగరాలలోని ప్రధాన కూరగాయల మార్కెట్లయిన గుడి మల్కాపూర్, ఎల్బీనగర్, బోయినపల్లి, మాదన్నపేట తదితర మార్కెట్ లతో పాటు మెహిదీపట్నం, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, అల్వాల్, ఎల్బీనగర్ వంటి ప్రధాన రైతుబజార్లకూ టమాటో దిగుమతి బాగా పడిపోయింది.
తెలంగాణలో కూరగాయల పంటలకు వర్షాలు పడటంతో వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తెప్పిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి వస్తున్నవే హైదరాబాద్ మార్కెట్ కు ఆధారంగా మారాయి. మహారాష్ట్ర లోని షోలాపూర్ నుంచి లారీ కిరాయి పది వేల రూపాయలకు పైగా వెచ్చించి టమాటాలు తేవడంతో ఇక్కడ చిల్లర ధర యాభై రూపాయలకు అమ్మాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వర్షాలు తగ్గు ముఖం పట్టడంతో త్వరలోనే ధరలు దిగొస్తాయి అంటున్నారు. పలు రకాల కూరగాయలు రవాణాలో కనీసం ఇరవై నుంచి ముప్పై శాతం దాకా పాడవుతున్నట్లు వివరించారు. ఇదిలా ఉంటే ఉల్లిగడ్డ ధర కూడా పైపైకి ఎగబాకుతూనే ఉంది. సెప్టెంబర్ మధ్య వారం వరకు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయల మధ్య ఉన్న ఉల్లి అమాంతం రెట్టింపైంది. దీంతో ఉల్లి కొనకముందే కన్నీరు పెట్టిస్తోంది. మొత్తం మీద పెరిగిన కూరగాయల ధరలతో సామాన్యుడి పై భారం మరింత పెరిగింది.