ఢిల్లీ టూర్ కి ముందే జగన్ కు మోడీ షాక్.! పోలవరం నిధులను నిలిపేసిన కేంద్రం.!
posted on Oct 5, 2019 11:32AM

పోలవరం ప్రాజెక్టు... నవ్యాంధ్రకు జీవనాడి... ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం కావడమే కాకుండా, దాదాపు వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. అలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చంద్రబాబు హయాంలో మూడొంతుల పని పూర్తి చేశారు. ఇక మిగిలింది పావు వంతే. కానీ రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ ప్రభుత్వం తిరకాసు పెట్టడంతో, పనుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. అటు కేంద్రం... ఇటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఎన్నిసార్లు అక్షింతలు వేసినాసరే మొండిగా ముందుకెళ్తోన్న జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. పోలవరం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల విడుదలను నిలిపివేసింది. కేంద్రం నుంచి దాదాపు 4వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా, 3వేల కోట్ల రూపాయల విడుదలకు ఫైల్ ముందుకు కదిలింది. అయితే, పోలవరం పనుల్లో అవినీతి జరిగిందని నివేదిక ఇవ్వడం... మరోవైపు రివర్స్ టెండరింగ్ తో రీటెండర్లు చేపట్టడంతో నిధుల రిలీజ్ కు బ్రేక్ వేసింది. దాంతో ఆ నిధులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని అంటున్నారు. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం పనుల్లో అక్రమాలు జరిగాయని నివేదిక ఇవ్వడంతో, ఆ సంగతేంటో తేలాకే నిధులు రిలీజ్ చేద్దామంటూ కేంద్రం ఫైలును పక్కనబెట్టిందని చెబుతున్నారు. పోలవరం వివాదం తేలేదాక కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశమే లేదంటున్నారు. దాంతో, జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడిందని వెలగపూడి వర్గాల్లో వినబడుతోంది. అంతేకాదు జగన్ ఏకపక్ష విధానాలతో మా కన్ను మేమే పొడుచుకున్నట్లైందని వైసీపీ నేతలు, కొందరు మంత్రులు వాపోతున్నారట. ఇప్పటికే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, ఇలాంటి సమయంలో ఈ నిధులు వచ్చుంటే కొంత వెసులుబాటు కలిగేందని, కానీ జగన్ అనాలోచిత నిర్ణయాల మూలంగా చిక్కుల్లో పడాల్సి వచ్చిందని అంటున్నారు. ఆర్ధికంగా అత్యంత క్లిష్టపరిస్థితులున్నప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిందిపోయి... ఇలా కష్టాలను కొని తెచ్చుకోవడమేంటని వ్యాఖ్యానిస్తున్నారు.