ఏపీలో భారీ వర్షాలు..తిరుమలలో ఈదురు గాలులతో వాన
posted on May 4, 2025 4:40PM

తిరుపతిలో భారీ వర్షం కురిసింది. తిరుమల శ్రీవారి ఆలయంపై మబ్బులు కమ్మాయి. శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీవారి ఆలయం ముందు భక్తులు తడుస్తూ పరుగులు తీశారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. బలమైన ఈదురు గాలులతో వర్షం పడటంతో పలు చోట్ల వృక్షాలు కూలియి. మరోవైపు విజయవాడ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు.దీంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. విజయవాడలోని మొగల్రాజపురం, పటమట ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి.
వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. భారీవర్షాల వల్ల ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును మూసివేశారు. శ్రీకనక దుర్గానగర్ గుండా భక్తులు రాకపోకలు కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు.పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్లు రోడ్లపై పడ్డాయి. ఉయ్యూరు-కాటూరు రోడ్డుపై చెట్టు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, అరటి పంటలకు తీవ్ర నష్టం జరిగింది.