తిరుపతిలో వైసీపీకి షాకే.. తేల్చేసిన ప్రీపోల్ సర్వే? వామ్మో జగన్  పాలనపై ఇంత వ్యతిరేకతా ! 

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో  జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన సీటుకు జనవరిలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ప్రధాన పార్టీలన్ని తిరుపతి ఎన్నికపైనే ఫోకస్ చేశాయి.  అందరి కంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ ప్రచారంపై దృష్టి సారించింది. ఉప ఎన్నిక కోసం సమన్వయ కమిటిని కూడా నియమించిన చంద్రబాబు.. తిరుపతిలో విజయానికి పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. అధికార పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికలోనే మల్లగుల్లాలు పడుతున్నాయి. సరైన నేతలు లేకపోవడంతోనే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. అభ్యర్థి ఎంపికపై ఆలస్యం చేస్తున్నాయని తెలుస్తోంది. 

 తిరుపతి లో అధికార పార్టీల కంటే టీడీపీలోనే  ఎక్కువ ఉత్సాహం కనిపిస్తోంది. అందుకు కారణం కూడా ఉందంటున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై ఇటీవల కొన్ని సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో తెలుగు దేశం పార్టీకే లీడ్ ఉందని తేలిందట.  జగన్ రెడ్డి ఏడాదిన్నర పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేల్లో వచ్చిందని చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, యువత, రైతులు, దళితులు .. చివరకి మందుబాబులు కూడా వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం వచ్చాకా సామాన్యులపై దాడులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై కేసులు, అధికార పార్టీ నేతల స్కాములు తప్ప.. ప్రజలకు జరిగిందేమి లేదనే భావనలో మెజార్టీ ప్రజలు ఉన్నారని సర్వే సంస్థలు స్పష్టం చేశాయంటున్నారు. ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీల విషయంలో వైసీపీ నేతల తీరు వివాదాస్పదమైంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలు తీరలేదు. గత ఏడాదిన్నరలో కొలువుల భర్తీ కూడా జరగలేదు. దీంతో ఆయా వర్గాలన్ని జగన్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని తేలిందట. 

నిజానికి తిరుపతి ఉప ఎన్నికలో తమ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన మొదట టీడీపీలో కనిపించింది. వైసీపీకి పట్టున్న ప్రాంతం  కావడం, సిట్టింగ్ ఎంపీ చనిపోవడంతో సహజంగా సానుభూతి కూడా ఉంటుంది. అధికారంలో ఉండటం కూడా వైసీపీకి కలిసివస్తోంది. ఇన్ని ప్రతికూలతలు ఉన్న తిరుపతిలో పోటీ ఇవ్వగలమా అన్న చర్చ కూడా టీడీపీ నేతల్లో జరిగిందట. తిరుపతిలో వైసీపీ, బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్న ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే తిరుపతిలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కరోనాకు చికిత్స తీసుకుంటూ చెన్నై ఆస్పత్రిలో చనిపోయారు బల్లి దుర్గాప్రసాద్. అయితే దుర్గాప్రసాద్  కుటుంబాన్నిఇంతవరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించలేదు. ఇదీ ఇప్పుడు తిరుపతిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏ నేత ఇలా వ్యవహరించలేదని జనాలు మాట్లాడుకుంటున్నారు. పార్టీ నేతలు అనారోగ్యం పాలయితేనే.. వారి యోగక్షేమాల గురించి పార్టీ పెద్దలు టెన్షన్ పడుతుంచారు. అలాంటిది ఒక ఎంపీ చనిపోతే.. ఆయన పార్టీ అధ్యక్షుడు, సీఎం హోదాలో ఉన్న జగన్ వారితో కనీసం మాట్లాడకపోవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. 

తిరుపతిలో ఎస్సీ ఓటర్లు  భారీగా  ఉంటారు. జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయి. చిత్తూరు జిల్లాలోనూ దళితులపై చాలా ప్రాంతాల్లో దాడులు జరిగాయి. దళితులకు వైసీపీ నేతలు శిరోముండనం వేయించిన ఘటనలు వెలుగుచూశాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర్లోని సీతానగరం పోలీస్ స్టేషన్లో ఒక దళిత యువకుడికి.. ఇన్‌చార్జి ఎస్సై  ట్రిమ్మర్ తో గుండు చేయించిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఆ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది.  అనంతపురం జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందిన జడ్జీ రామకృష్ణ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. దళిత జడ్జీ ఫ్యామిలీకే రక్షణ లేదంటే.. ఏపీలో  సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. దళితులపై జరిగిన, జరుగుతూనే ఉన్న దాడులతో .. ఆ సామాజిక వర్గంతా వైసీసీపైనా,  సీఎం జగన్ పైనా ప్రతీకారానికి సిద్ధంగా ఉన్నారని, లోక్ సభ ఉప ఎన్నికల్లో అది చూపించబోతున్నారని చెబుతున్నారు. 

మందుబాబులు కూడా జగన్ సర్కార్ పై రగిలిపోతున్నారని తెలుస్తోంది.  కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం.. లిక్కర్ రేట్లను భారీగా పెంచింది. రేటు పెరిగితే మద్యం తాగడానికి జనాలు భయపడతారని.. అందురే రేట్లు పెంచామనే కవరింగ్ ఇచ్చుకుంది. అయితే ఇప్పుడు లిక్కర్ సేల్స్ నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంది. పెరిగిన రేట్లతో తాము రోజంతా కష్టపడి సంపాదించినదంతా లిక్కర్ కే పోతుందని మందు బాబులు ఆరోపిస్తున్నారు. సర్కార్ ఆదాయం కోసమ తమను దోచుకుంటుందని వారంతా మండిపోతున్నారు. రైతులు కూడా వైసీపీ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. కాని వరదలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంతో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. వరద బాధితులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. అంతేకాదు కష్టాల్లో ఉన్న తమను కనీసం పరామర్శించడానికి  కూడా వైసీపీ నేతలు రాలేదని ఆరోపిస్తున్నారు రైతులు. ఇవన్ని తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీని నష్టం కలిగించబోతున్నాయని చెబుతున్నారు. 

 మొత్తానికి  తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై వచ్చిన ప్రీపోల్ సర్వే ఫలితాలతో టీడీపీకి  మరింత బూస్ట్ వచ్చిందని చెబుతున్నారు.  దీంతో తమ్ముళ్లు మరింత ఉత్సాహంగా పని చేయడానికి సిద్ధమవుతున్నారు. అందుకే టీడీపీ అభ్యర్థిగా ఖరారైన మాజీ ఎంపీ పనబాక లక్ష్మి కూడా తాను విజయం సాధించడం ఖాయమని ధీమాగా చెబుతున్నారు.  మరోవైపు తాము నిర్వహించిన సర్వేల్లో వ్యతిరేక ఫలితాలు రావడం వల్లే అభ్యర్థుల ఎంపికలో వైసీపీ, బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా అన్ని అనుకూలతలే ఉండటంతో జగన్  రెడ్డి సర్కార్ ఏడాదిన్నర పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పుగా తిరుపతి ఉపఎన్నికను మలుచుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu