అధికార, ప్రతిపక్షాల మధ్య రగులుతున్నపంటల మంటలు
posted on Dec 29, 2014 6:54PM
.jpg)
రాజధానికి భూమిని ఇచ్చేందుకు నిరాకరిస్తున్న కొన్ని గ్రామాలలో అరటి తోటలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కొన్ని షెడ్లు ఎవరో గుర్తు తెలియని దుండగులు తగులబెట్టడం సహజంగానే అనేక అనుమానాలకు, వాద ప్రతివాదాలకు అవకాశం కల్పిస్తోంది.
రాజధానికి భూములు ఇచ్చేందుకు ఆ గ్రామాల రైతులు నిరాకరిస్తున్నందున వారిని భయాందోళనలకు గురిచేసేందుకే అధికార పార్టీ నేతలు అటువంటి హేయమయిన పనికి పూనుకొని ఉంటారని వైకాపా అధికార ప్రతినిది పార్దసారధి ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేసారు.
అందుకు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా అంతే ధీటుగా బదులిచ్చారు. అటువంటి నేర చరిత్ర జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీ నేతలకే ఉందని, వారే అటువంటి కుట్రకు పాల్పడి స్థానిక ప్రజలను రెచ్చగొట్టి తద్వారా అక్కడ రాజధాని రాకుండా అడ్డుపడుతున్నారనే అనుమానాలు తమకున్నాయన్నారు. హమ ప్రభుత్వం తప్పకుండా ఆ కుట్రను చేదించి ఈ దురాఘతానికి పాల్పడినవారిని వారి వెనుక ఉన్న నేతలను కూడా బయటపెడతామని హెచ్చరించారు.
రెండు పార్టీలు ఎదుటవారి మీద ఇంత తీవ్రమయిన ఆరోపణలు చేస్తున్నందున దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి నిందితులను ప్రజల ముందు నిలబెట్టడమే అన్ని విధాలమంచిది. అప్పుడు ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెపుతారు.