తెలంగాణలో ముగ్గురు రైతుల ఆత్మహత్య
posted on Oct 15, 2014 3:46PM

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే వున్నాయి. బుధవారం నాడు ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్గొండ జిల్లా దీపకుంటలో బొబ్బిలి వెంకటరెడ్డి అనే రైతు తన పదెకరాల పత్తిపంట ఎండిపోయిందన్న మనస్తాపంతో, అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి చనిపోయాడు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో మధురయ్య విద్యుత్ కోతల వల్ల పంట ఎండిపోయిందనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు ఎకరాల భూమిలో వరి సాగు కోసం లక్ష రూపాయలు అప్పు చేసిన మధురయ్య ఆ అప్పును తీర్చలేనన్న ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. అలాగే నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కల్లేపల్లిలో మాలోతు రవి అనే రైతు తన మిరప చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను వేసిన పత్తి, మిరప పంటలు ఎండిపోయాయన్న బాధతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు.