భీమవరంకు ప్రత్యేక హోదా కోసం తోట సీతరామ లక్ష్మి కృషి

 

తెదేపా రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లాల్లో గల భీమవరం పట్టణానికి ప్రత్యేక గుర్తింపు కోసం కృషి చేస్తున్నారు. సాధారణంగా ఏ ప్రాంతం నుండయినా ఏడాదికి వెయ్యి కోట్లు పైబడి ఎగుమతులు జరుగుతునట్లయితే ఆ ప్రాంతానికి లేదా పట్టణానికి ‘టౌన్ ఆఫ్ ఎక్స్ పోర్ట్ ఎక్స్ లెన్స్’ అనే ప్రత్యేక హోదాను కేంద్రం కేటాయిస్తుంది. తద్వారా ఆ ప్రాంతంలో ఎగుమతులు చేస్తున్న వ్యాపారులకు, సంస్థలకు పన్ను రాయితీలు, ఈపీసీజీ పధకం క్రింద విదేశాల నుండి ఎటువంటి పన్నులు లేకుండా అవసరమయిన యంత్ర పరికరాలను తెప్పించుకోవడానికి వీలవుతుంది. ఈ ప్రత్యేక గుర్తింపు పొందిన పట్టణానికి కేంద్రం కూడా అనేక విధాల సహాయసహకారాలు అందిస్తుంది. ఇక భీమవరం పట్టణం రొయ్యల ఎగుమతులు చాలా ప్రసిద్ది చెందింది. ఈ ప్రాంతంలో ఏడాదికి దాదాపు రూ.3800 కోట్లు పైబడి ఎగుమతుల ద్వారా వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. కానీ ఇంతవరకు ప్రజా ప్రతినిధులెవరూ ప్రత్యేక హోదా కోసం గట్టిగా కృషి చేయలేదు. కానీ ఈ మధ్యనే తెదేపా రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయిన తోట సీతా రామ లక్ష్మి, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మంత్రి నిర్మలా సీతారామన్ నను కలిసి భీమవరానికి ‘టౌన్ ఆఫ్ ఎక్స్ పోర్ట్ ఎక్స్ లెన్స్’ గుర్తింపు ఇవ్వాలని అభ్యర్ధించారు. ఆమె అభ్యర్ధనకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఇదే విధంగా రాష్ట్రానికి చెందిన యంపీలు, యం.యల్యేలు అందరూ తమ నియోజక వర్గాల అభివృద్ధికి కృషి చేసినట్లయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందగలవు.