ఈ హక్కుకు న్యాయం చేస్తున్నామా??

 

మనిషికి సమాజం, ఈ రాజ్యాంగం బోలెడు హక్కులు ఇచ్చింది. పిల్లల నుండి పెద్దల వరకు వయసును, వికాసాన్ని, స్వేచ్ఛను ప్రతిబింబించేలా బోలెడు హక్కులు ఉన్నాయి. వాటిని మనిషి తనకు అవసరమైనప్పుడు చక్కగా వినియోగించుకుంటూ ఉంటాడు. అలాంటి హక్కుల జాబితాలో చాలా అరుధైనది, సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని శాసించగలిగేది ప్రజాస్వామ్య పాలనకు బ్రహ్మాస్త్రం వంటిది ఓటు హక్కు.

చట్టమిచ్చిన ఆయుధం!!

నిజానికి అన్ని హక్కులు మనిషికి స్వేచ్ఛను ఇస్తే, ఓటు హక్కు రూపంలో న్యాయాధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టింది రాజ్యాంగం. రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కును కేటాయించింది. ఈ ఓటు హక్కు ద్వారా అవినీతి లేని, సమర్థవంతమైన నాయకులను ఎన్నుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తూ సుపరిపాలన అందించాలనేది ఓటు హక్కు ముఖ్య ఉద్దేశం.

పౌరుల అపహాస్యం!!

ఒక గొప్ప ఆయుధాన్ని చేతికి ఇచ్చినప్పుడు ఒక మూర్ఖుడు ఆ ఆయుధాన్ని దారిన వెళ్లే పీచుమిఠాయి బండి వాడికి అంటే పాత సామాను కొనేవాడికి వేసాడంటా, ఆ ఆయుధం తీసుకున్నవాడు ఓ గుప్పెడు పీచుమిఠాయిని వీడి చేతిలో పెట్టి ఎంచక్కా వెళ్ళిపోయాడు. ఆ పీచుమిఠాయిని నిమిషంలో తినేసి అసంతృప్తిగా వెళ్లినా ఉచితంగా వచ్చింది కదా అని తృప్తి పడ్డాడు వాడు.

అయితే ఆయుధం తీసుకుని పోయిన వాడు దాంతో అన్యాయంగా అందరి ప్రాణాలు తీస్తూ, ఉండిపోయాడు. 

ఇలా ప్రస్తుతం భారతదేశ పౌరులు కూడా ఓటు హక్కును సరిగా వినియోగించుకోకుండా తాత్కాలిక తృప్తి ఇస్తోందని అయిదు వందల నుండి, రెండు వేల వరకు ఓటును రాజకీయ నాయకులకు అమ్మేస్తూ ఓటు హక్కును అపహాస్యం చేస్తున్నారు.

రాజకీయ నాయకుల దందా!!

రాజకీయ నాయకులు ప్రజలకు సరైన న్యాయం చేయరు. లబ్ధిదారులకు పథకాలను మంజూరు చేయడంలో అలసత్వం, ప్రాజెక్టుల పేరుతో స్కాములు చేసి చల్లగా ఆ నిధులు మింగేయడం,  భూములను స్వాధీనం చేసుకోవడం. అవినీతి కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం, ప్రోత్సహించడం వాళ్ళ నుండి  కమీషన్లు తీసుకోవడం చేస్తారు.

ఇలా వాళ్ళు రాజకీయ ప్రవేశం చేసిన ముందు, తరువాత అని గమనిస్తే వాళ్ళ జీవితాల్లో ఎంత తేడా ఉందొ అందరికీ అర్థమవుతుంది.

అర్థం చేసుకోరేందుకు??

ప్రజలు ఏమీ అమాయకులు కాదు. చాలా  తెలివితేటలు ఉంటాయి ప్రజలకు. కానీ ఒక రాజకీయ నాయకుడు మోసాలతో ఎంత ఎదిగిపోతూ ప్రజల ధనాన్ని ఎంత వెనకేసుకుంటున్నాడో అందరికీ తెలుసు కానీ పిచ్చి జనాలు ఈ ఓటు హక్కును అంత నిర్లక్ష్యంగా చూస్తారెందుకు?? 

సమాజాన్ని, ప్రజలను అధికారం పేరుతో ముప్పుతిప్పలు పెట్టె ఈ రాజకీయ నాయకులకు కరెన్సీ కాగితాలు తీసుకుని ఓటు వేస్తే, వాళ్ళు తిరిగి ఎన్నికలు వచ్చేవరకు ప్రజల గూర్చి మర్చిపోతారు. అలాంటి మహానుభావుల కోసం ఎంతో గొప్ప ఆయుధాన్ని వ్యర్థం చేస్తారెందుకు??

మార్పు కావలిప్పుడే!!

న్యాయాన్ని, ధర్మాన్ని, ప్రజలను ముఖ్యంగా ప్రజలకు ఎంతో గొప్ప ఆయుధాన్ని ఇచ్చిన ఓటు హక్కును అపహాస్యం చేస్తున్న రాజకీయ ప్రస్థానాలకు ముగింపు పలకాలి. వాస్తవాన్ని  మాత్రమే కాదు భవిష్యత్తును గురించి ఆలోచించాలి. సమాజాన్ని సంస్కరిస్తూ రేపటి తరాలకు గొప్ప సమాజాన్ని ఇవ్వగలిగే నాయకులను అధికారంలో నిలబెట్టాలి.

ఇలా జరగాలి అంటే మీ ఓటు హక్కును న్యాయం చేస్తున్నామా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలిప్పుడు.

◆ వెంకటేష్ పువ్వాడ