రెండు జిల్లాల్లో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్!.. జగనన్నకు పరీక్ష...
posted on Apr 27, 2022 1:06PM
విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తానంటూ గొప్పలు చెప్పారు జగనన్న. నాడు-నేడు అంటూ బడులు మార్చేస్తానన్నారు. కొవిడ్ విజృంభన సమయంలోనూ పరీక్షలు పెడతానన్నారు. అన్ని నీతులు చెప్పిన సీఎం జగన్.. పదో తరగతి పరీక్షల నిర్వహణను మాత్రం పకడ్బందీగా నిర్వహించలేకపోయారు. ఇప్పటికే పరీక్షల కోసం విద్యార్థులతో బెంచీలు మోయించిన ఘటనలు విమర్శల పాలవుతుంటే.. తాజాగా, రెండు జిల్లాల్లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటూ వార్తలు రావడం కలకలం రేపుతోంది.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకైంది. పరీక్ష ప్రారంభం కంటే ముందే ప్రశ్నపత్రం వాట్సాప్‌లో వెలుగుచూసింది. ఇన్విజిలేటర్, సూపర్‌వైజర్ లీక్ చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు, చిత్తూరు జిల్లాలో కూడా పదో తరగతి ప్రశ్నపత్రం లీకైనట్లు వార్తలు వచ్చాయి. కలెక్టర్ హరినారాయణన్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా.. తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు. చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెప్పారు.