వైసీపీ లో టెన్షన్ టెన్షన్!

అందరి చూపులు  ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ఉన్నాయి. అధికార వైసీపీ ఏడుగురు అభ్యర్థులను రంగంలోకి దింపితే.. ప్రతిపక్ష టీడీపీ   ఒక అభ్యర్థిని బరిలో నిలిపింది. మరో వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడంతో.. అధికార పార్టీ  ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొందని..  ఆ క్రమంలో తాము బరిలో నిలిపిన మొత్తం అభ్యర్థులంతా గెలిచి తీరాలనే   లక్ష్యంతో    ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తోంది.

మరో వైపు తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థి   పంచుమర్తి అనురాధ విజయంపై గట్టి నమ్మకంతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా తీవ్ర ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలలో    ఎమ్మెల్సీ విజయానికి 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. మరోవైపు 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారిలో నలుగురు... వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేశ్‌కుమార్, కరణం బలరాం.. ఆ తర్వాత జగన్ పార్టీలోకి జంప్ కొట్టారు. కానీ వీరు జగన్ పార్టీ ఎమ్మెల్యేలుగా స్పీకర్ పరిగణించకపోవడంతో.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతూ జీత భత్యాలు అందుకొంటున్నారు.  

ఇంకోవైపు ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేయాలంటూ..  తెలుగుదేశం వీప్   జారీ చేసింది. మరి ఈ నలుగురు ఎమ్మెల్యేలు.. పంచుమర్తి అనురాధకు ఓటు వేస్తారా? అంటే సందేహమే అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. మరి  ఈ నలుగురు ఎమ్మెల్యేలు.. పంచుమర్తి అనురాధకు ఓటు వేయకుంటే.. కేవలం 19 ఓట్లే వస్తాయి.  మరో మూడు ఓట్లు పడితేనే కానీ ఆమె ఎమ్మెల్సీగా విజయం సాధిస్తారు.

అదలా ఉంటే జగన్ పార్టీలో అస్మమతి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు...  ఈ ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తామని ఇప్పటికే క్లియర్ కట్‌గా ప్రకటించేశారు.  అదీకాక  వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ తెలుగుదేశం తరఫున పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని ప్రచారంలో ఉంది. దీంతో వీరిరువురూ  తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధకే ఓటే వేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక వైసీపీలో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర ఆసంతృప్తితో ఉన్నారని.. వారు కనీసం ఆరుగురు ఉంటారని చెబుతున్నారు. ఈ ఆరుగురూ కూడా తెలుగుదేశం అభ్యర్థికి   ఓటు వేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.  అదే జరిగితే.. వైసీపీకి శృంగభంగం తప్పదని పరిశీలకులు అంటున్నారు.  

ఏదీ ఏమైనా మార్చి 23వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే.. టీడీపీ తరపున బరిలో దిగిన ఒకే ఒక్క అభ్యర్థి పంచుమర్తి అనురాధ కనుక విజయం సాధిస్తే.. గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలకు కొనసాగింపుగా ఈ ఫలితం వచ్చిందని.. భావించవచ్చు అనే చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.