అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి కన్నుమూత

అమెరికాలో పెచ్చరిల్లుతున్న గన్ కల్చర్ కారణంగా అమాయకులు అసువులు బాస్తున్నారు. తాజాగా అమెరికాలో కాల్పుల ఘటనలో తెలంగాణ యువకుడు మరణించాడు. ఎమ్ ఎస్ చదవడానికి నాలుగు నెలల కిందట అమెరికా వెళ్లిన ఖమ్మానికి చెందిన సాయి తేజ ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో కన్నుమూశాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన సాయి తేజ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసిన అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  సాయితేజ మరణ వార్తతో అతని స్వగ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.    ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు, వాణి దంపతుల కుమారుడు సాయితేజ. ఉన్నత చదువుల కోసమని 4నెలల క్రితం అతడు అమెరికా వెళ్లాడు. అక్కడ చదువుకుంటూనే  ఒక షాపింగ్ మాల్‌లో స్టోర్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.  

శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం  ఒంటిగంట ప్రాంతంలో ఇద్దరు దుండగులు సాయితేజ పనిచేస్తున్న స్టోర్‌కు వచ్చి వచ్చీరావడంతోనే కాల్పులు ప్రారంభించారు. ఆ కాల్పుల్లో సాయితేజ అక్కడికక్కడే మరణించారు. కాల్పులు జరిపి మాల్ లో అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన దుండగులు కౌంటర్ నుంచి సొమ్ము దొంగిలించి పారిపోయారు. సాయితేజ కుటుంబ సభ్యులను మంత్రులు పొంగులేని శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. సాయితేజ భౌతిక కాయాన్ని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu