తెలంగాణతో తిరిగొస్తా: కెసిఆర్

 

 

 

ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణ వచ్చితీరుతుందని, రేపు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళుతున్నానని, తిరిగి వచ్చేది తెలంగాణ రాష్టంలోకేనని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు తిరస్కరణకు గురికావడంపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ 15 రోజులలో తెలంగాణ ప్రజల కల సాకారం కాబోతుందని, ఎవరూ నిరాశ చెందవద్దని, సంతోషంగా ఉండాలని, సంబరాలు చేసుకుందామని, స్వీట్లు తినిపిస్తానని స్పష్టం చేశారు.

 

ముఖ్యమంత్రి కిరణ్‌కు, ప్రతిపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏం మాట్లాడాలో తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి అనుకుంటే శాసనసభనే రద్దు చేయగలని, వాళ్ళవి చిల్లర వ్యాఖ్యలని ఆయన విమర్శించారు. ఇంత జరిగిన తర్వాత ఇక కలిసి ఉండలేమని, మానసికంగా విడిపోయామని కేసీఆర్ పేర్కొన్నారు. సీమాంధ్రకు ఏం కావాలో కేంద్రం కోరుకోమని అంటే, కోరుకోకుండా ఏదో మాట్లాడుతున్నారని కేసీఆర్ అన్నారు.



తెలంగాణ విషయంలో తెలంగాణ ప్రజలు నిర్భయంగా ఉండాలని, ఈరోజుతో అసెంబ్లీ అయిపోయిందని, ముఖ్యమంత్రి కిరణ్, చంద్రబాబు నాయుడులు ఏం చేయలేరని, ఇక జరగాల్సింది ఢిల్లీలోనేనని కేసీఆర్ పేర్కొన్నారు.