జగన్ తండ్రిని పొగిడినా సహించలేడుట!

 

వైకాపా నుండి బయటపడేవారు అందరూ చెప్పే మాట ఒక్కటే! జగన్మోహన్ రెడ్డికి చిన్నాపెద్ద అనే గౌరవం లేదని! పార్టీలో నుండి బయటకి పోయేవారు పార్టీపై, పార్టీ అధినేతపై ఏదో ఒక ఆరోపణలు చేసి పోవడం సహజమే అయినప్పటికీ, ఈవిధంగా అందరూ ఒకే రకమయిన ఆరోపణలు చేస్తుండటం చూస్తే, జగన్మోహన్ రెడ్డి ఎటువంటివాడో, పార్టీలో సీనియర్ల పరిస్థితి ఏమిటో అర్ధం అవుతుంది.

 

నరసాపురం నుండి వైకాపా లోక్ సభ అభ్యర్ధిగా పేర్కొనబడిన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడుతున్నరంటూ ఈరోజు పార్టీ నుండి సస్పెండ్ చేయబడిన తరువాత, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిపై ఇంచుమించు ఇవే రకమయిన ఆరోపణలు చేసారు.

 

ఆయన మీడియాతో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్డి పైకి చాలా గట్టిగా సమైక్యవాదం చేస్తున్నా, ఆయన సమైక్య ముసుగులో పనిచేస్తున్న విభజనవాది. పార్టీలో ఎవరయినా గట్టిగా సమైక్యవాదం చేస్తే ఆయన సహించలేరు. పార్టీలో పెద్దవాళ్ళకి, సీనియర్లకి ఆయన తగిన గౌరవం ఈయకపోయినా అందరూ ఆయనని గౌరవంగా ‘సర్’ అని మాత్రమే సంభోదించాలి. లేకుంటే ఆయనకు చాలా కోపం వస్తుంది. చివరకి ఎవరయినా ఆయన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని పొగిడినా ఆయన తట్టుకోలేడు. ఆయన అహంభావం తట్టుకోవడం చాల కష్టం. ఆయనకీ తగిన బుద్ధి చెప్పెందుకే నేను రాజకీయాలలో కొనసాగాలనుకొంటున్నాను. త్వరలో నా రాజకీయ భవిష్యత్ ప్రణాళిక గురించి తెలియజేస్తాను,” అని తెలిపారు. రఘురామ కృష్ణంరాజు నిన్న బీజేపీ నేత వెంకయ్య నాయుడిని కలిసినట్లు సమాచారం. బహుశః ఆయన బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నారేమో!

 

ఒక రాజకీయ పార్టీని నడిపే వ్యక్తికి చాలా సహనం, అందరినీ కలుపుకుపోగల నేర్పు ఉండాలి. కానీ, కేవలం వ్యక్తిగత ఆకర్షణతోనే ఎల్లకాలం పార్టీని నడుపుదామనుకొంటే ఆ ఆకర్షణ కనుమరగయిననాడు, పార్టీ కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అందుకు ఒక చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చును.