నిన్న యోగితా..నేడు సచిన్..రేపెవరు?

మహారాష్ట్రలో కరువు విలయతాండవం చేస్తోంది. ఎప్పుడూ లేని విధంగా తాగేందుకు గుక్కడు నీళ్లు కూడా లేక జనం అల్లాడిపోతున్నారు. మరాఠ్వాడాలోని ఎనిమిది జిల్లాల్లో లాతూర్‌లో అయితే పరిస్థితి మరింత భయానకంగా ఉంది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏకంగా ప్రత్యేక రైలు వ్యాగన్లను తయారుచేసి సాంగ్లీ జిల్లా మిరజ్ పట్టణం నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే అవి డిమాండ్‌కు ఏమాత్రం సరిపోవడం లేదు. మరోవైపు కరవు పసిప్రాణాల పాలిట శాపంగా మారుతోంది. అభం శుభం తెలియని చిన్నారులు గొంతును తడి చేసుకునేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు.

 

బీడ్ జిల్లాలో యోగితా దేశాయ్ అనే చిన్నారి మండుటెండలో నీటి కోసం అరకిలోమీటరు దూరంలో ఉన్న సంపు దగ్గరికి ఐదు సార్లు అటూ ఇటూ తిరిగింది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆ బాలికను ఇంట్లో వాళ్లు నీళ్లు పట్టుకుని రమ్మని పంపారు. చివరకు ఐదోసారి వెళ్లినపుడు..ఇంటికి తిరిగిరాలేదు. ఎంతసేపటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు వెళ్లి చూడగా, బాలిక సంపు దగ్గర కుప్పకూలి ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేదు. గుండెపోటు, డీహైడ్రేషన్ కారణంగా చిన్నారి అప్పటికే మరణించిందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.  కరువు తమ కంటిపాపను దూరం చేసిందని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు.  

 

ఈ ఘటన మరవకముందే మరో బాలుడు నీటి కోసం బలయ్యాడు. సచిన్ కేదార్ అనే బాలుడు నీటి కోసం తన సైకిల్‌పై గ్రామంలోని బావివద్దకు వెళ్లాడు. నీళ్లు తోడుతుండగా కాలు జారి బావిలో పడ్డాడు. బాలుడికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి బాలుడిని బావిలోంచి బయటకు తీసి బతికించడానికి ప్రయత్నించారు. అప్పటికే అతడు మరణించాడు.

 

నీటి కోసం కుటుంబమంతా వాటర్ ట్యాంకర్లు, చేతిపంపులు, బావుల వద్ద గంటల కొద్ది నిలబడాల్సి వస్తోందివ. అవి లేనిపక్షంలో కిలో మీటర్ల దూరం వెళ్లి గంగమ్మను తీసుకురావాలి. పెద్ద వారు మండుటెండల్లో అంత దూరం వెళ్లలేక పిల్లల్ని పంపిస్తున్నారు. ఇది వారిపట్ల మరణశాసనమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ఇలాంటి యోగితలు..సచిన్‌లు సమిధలవుతూనే ఉంటారు.