టీ సర్కార్ కు మరోసారి సుప్రీం చురక
posted on Sep 15, 2015 1:12PM

ఇప్పటికే ఎన్నోసార్లు తెలంగాణ ప్రభుత్వం తమ సొంతగా తీసుకున్న నిర్ణయాలకు గాను అటు హైకోర్టులో కాని.. ఇటు సుప్రీంకోర్టులో కాని మొట్టికాయలు తింటునే ఉంది. తొందరపడి తీసుకున్న నిర్ణయాలవల్లనో లేక.. కావాలని ఒంటెద్దు పోకడని అనుసరిస్తూ తీసుకున్న నిర్ణయాలే కావచ్చు కాని మొత్తానికి పలుమార్లు ధర్మాసనాల చేతిలో టీ సర్కార్ చురకలు వేయించుకుంది.
ఇప్పుడు కూడా తాజాగా టీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కళింగులు బీసీల వర్గానికి చెందేవారిగా చట్లాలు అమల్లో ఉండేవి. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో కళింగ సామాజిక వర్గం లేనందున రాష్ట్రం ఆ వర్గాన్ని బీసీ జాబితా నుండి తీసేసింది. ఈ నేపథ్యంలో దీనిపై వైద్య విద్యాకోర్సుల్లో తాము రిజర్వేషన్లు కోల్పోతున్నామంటూ ఇద్దరు వైద్య విద్యార్ధినులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి తలంటింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాల అమలు ప్రకారం వారికి రిజర్వేషన్లు ఉన్నప్పుడు ఏ ప్రాతిపదికన మీరు రిజర్వేషన్లు తీసేస్తారని ప్రశ్నించింది. ఏపీకి చెందిన విద్యార్థులు రిజర్వేషన్లు ఉందని వస్తారు.. లేవని మీరెలా చెప్తారు అని గట్టిగా అడిగింది. విభజన వల్ల కొన్ని జిల్లాలు ఒక రాష్ట్రానికి వెళ్లినంత మాత్రాన రిజర్వేషన్లు చెల్లవని చెప్పటం సమంజసం కాదని అభిప్రాయపడటం గమనార్హం. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం సరైన అవగాహన లేకుండానే నిర్ణయాలు తీసుకోవడం వల్ల పలు అంశాల్లో ఇలా చురకలు అంటించుకోవాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.