తెలంగాణ జడ్జిలపై సస్పెన్షన్ ఎత్తివేత..

తెలంగాణ జడ్జిలపై విధించిన సస్పెన్షన్‌ను ఉమ్మడి హైకోర్టు ఎత్తివేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ భోస్లే నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి హైకోర్టు విభజన, సీమాంధ్ర న్యాయాధికారులకు ఆప్షన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జడ్జిలు, న్యాయవాదులు ఆందోళనకు దిగడంతో పాటు మూకుమ్మడిగా రాజీనామాలను చేశారు. అనంతరం ర్యాలీగా గవర్నర్‌ను కలవాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపి గవర్నర్‌ని కలిసి తమ డిమాండ్లను వివరించారు. అయితే, న్యాయాధికారులుగా ఉండి రోడ్డెక్కడంపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. క్రమశిక్షణా చర్యల కింద 11 మంది న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో సమ్మెను మరింత ఉధృతం చేశారు న్యాయాధికారులు. అయితే గవర్నర్, ఏసీజే హామీతో జూలై 5న వారు సమ్మె విరమించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి భోస్లే బదిలీపై వెళుతున్న చివరి రోజునే ఆయన న్యాయాధికారులు వరప్రసాద్, రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్ ప్రసాద్, రామాకాంత, డా.సున్నం శ్రీనివాసర్ రెడ్డి, జి.వేణు, ఎం.రాధాకృష్ణ, పి.రాజు, మురళీధర్, ఎస్.సరిత, ఆర్.తిరుపతిలపై విధించిన సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు.