అమెరికా పతనమే ట్రంప్ కోరిక-హిల్లరీ క్లింటన్

అగ్రరాజ్యంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ తరపున ఆ దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారు కాగా..డెమొక్రటిక్ పార్టీ తరపున అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి, మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ బరిలోకి దిగుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న తొలి మహిళగా హిల్లరీ రికార్డు సృష్టించారు. ఇక ట్రంప్‌పై విజయం సాధిస్తే..అమెరికాకు తొలి మహిళా దేశాధ్యక్షురాలిగా ఆమె చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఫిలదెల్పియాలో జరుగుతున్న డెమొక్రటిక్ పార్టీ కన్వెన్షన్‌లో హిల్లరీ ఉద్వేగంగా ప్రసంగించారు. తన ప్రత్యర్థి ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. అమెరికా విచ్ఛిన్నాన్ని ట్రంప్ కోరుకుంటున్నారని ఆమె ఆరోపించారు. తన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించని ట్రంప్ అమెరికాను అభివృద్ధి బాటలో ఎలా నడిస్తారని హిల్లరీ ప్రశ్నించారు. జేబులో తుపాకులు పెట్టుకునే వ్యక్తికి అధ్యక్ష పదవిని ఎలా కట్టబెట్టాగలరంటూ విమర్శించారు.