మా ఇంటర్.. మా ఇష్టం..
posted on Dec 2, 2014 3:01PM
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి మరో అడుగు ముందుకు వేసింది. మార్చి 9వ తేదీ నుంచి సొంతగా ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించుకోవాలని సంకల్పించింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. మార్చి 9 నుంచి తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. విభజన చట్టంలోని పదవ షెడ్యూలు ప్రకారం ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇంటర్ పరీక్షల విషయంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిని మళ్ళించడానికే చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వంతో గొడవ పెట్టుకుంటున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల విషయంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కేంద్ర ప్రభుత్వానికి తమ మీద ఫిర్యాదు చేసినా సరే, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.