ప్రభుత్వం లేదా.. మేమే అదేశాలివ్వాలా? హైకోర్టు సీరియ‌స్‌ 

ఓవైపు ఊరూరా క‌రోనా. మ‌రోవైపు ప‌బ్బుల్లో, మ‌ద్యం షాపుల్లో తాగి తందానా. స్కూల్స్ క్లోజ్‌. సినిమా హాల్స్ మాత్రం హౌజ్‌ఫుల్‌. ఇదేం తీరు? ఇలాగైతే ఎలా? అంటూ తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.  జన సంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. సినిమా హాళ్లు, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు నిల‌దీసింది. ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఉండటం లేదన్న‌ కోర్టు.. పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా? అని సూటిగా ప్రశ్నించింది.

రాష్ట్రంలో జన సంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఏజీ కోర్టుకు తెలిపారు. ‘ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు? ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా?  ఆదేశాలు ఇవ్వమంటారా?’ అని హైకోర్టు మండిపడింది. 

ఇప్ప‌టికే అనేక రాష్ట్రాలు, అనేక న‌గ‌రాలు వీకెండ్ లాక్‌డౌన్‌, రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్నాయి. తెలంగాణ‌లో మాత్రం అలాంటి చ‌ర్య‌లు ఏమీ లేక‌పోవ‌డం, క‌నీసం అలాంటి ఆలోచ‌న కూడా చేయ‌క‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. హైకోర్టు సైతం ఇదే విష‌యంపై నిల‌దీయడంతో స‌ర్కారు ఇర‌కాటంలో ప‌డింది.