కేసీఆర్ కి షాక్..తెరపైకి పాత కేసు

 

గత టర్మ్ లో ( 2018 ) తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ పట్ల అనుచితంగా వ్యవహరించారని, ఆయనపై దాడి చేశారన్న కారణంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌పై బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. కాగా తాము ఏ తప్పూ చేయలేదని, దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని వారు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సస్పెన్షన్‌ చెల్లదని తీర్పు వెలువరించింది. అయితే, ఆ తీర్పును అమలు చేయకపోవడంతో  కోమటిరెడ్డి, సంపత్‌ కోర్టులో తీర్పు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం శాసన సభ, న్యాయ శాఖ కార్యదర్శులకు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. కోర్టు తీర్పును అమలు పరచకపోవడం,గతంలో కోర్టుకు హాజరుకావాలని చెప్పినా ఇద్దరు కార్యదర్శులు హాజరు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టుకు హాజరు కావాలని శాసన సభ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌ రావులను ఆదేశించింది.