మాస్క్ మస్ట్.. లేకుంటే వెయ్యి ఫైన్
posted on Apr 11, 2021 4:48PM
తెలంగాణలోవేల సంఖ్యలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటోంది. ఇకపై మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానాగా వడ్డిస్తారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్-2005, కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సర్కారు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.బహిరంగ ప్రదేశాల్లోనూ, ప్రయాణాల్లోనూ, పనిచేసే ప్రదేశాల్లోనూ మాస్కు తప్పనిసరి అని సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తాజా ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలంటూ జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు.

తెలంగాణలో అనూహ్యంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3,187 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 1,759 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 20,184 యాక్టివ్ కేసులున్నారు. 13,366 మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 551 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు దొరకడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్ పడకలు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.