వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం
posted on Apr 11, 2021 6:05PM
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు ఘోర అవమానం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూపిలిపాళెంలో వైసీపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సభలో ఎమ్మెల్యే వరప్రసాద్ తీరును మత్స్యకారులు తీవ్రంగా ఎండగట్టారు. సముద్ర ముఖద్వారం, తమిళనాడు బోట్ల సమస్యలని ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే సమావేశం నుంచి వెళ్లిపోవాలంటూ పెద్దపట్టున మత్స్యకారులు నినాదాలు చేశారు. వద్దని వారించబోయిన నేతలతో వాగ్వివాదానికి దిగారు. ఎన్నికలప్పుడే తమపై ప్రేమ పుట్టుకొస్తుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు సాక్షిగా ఎమ్మెల్యేపై స్థానిక మత్స్యకారులు మండిపడ్డారు. ఎమ్మెల్యేపైకి దూసుకువచ్చిన మత్స్యకారులను ఇతర నేతలు అడ్డుకున్నారు. మంత్రి, ఎంపీ ఎంతగా వారించినా.. ఎమ్మెల్యేపై ఆరోపణలు అపలేదు స్థానికులు. సమావేశం రసాభసగా మారడంతో కార్యక్రమాన్ని మమా అనిపించి అక్కడి నుంచి మంత్రి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ అక్కడి నుంచి వెళ్లిపోయారు.