తెలంగాణలో మరో ఆరు విమానాశ్రయాలు!!

 

తెలంగాణాలో ఆరు కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విమానాశ్రయాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నేరుగా ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ని ప్రభుత్వం సంప్రదించినట్లు సమాచారం. కన్సల్టెన్సీ ఫీజుగా రూ. 4.5 కోట్లు చెల్లించేందుకు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఒకసారి సాధ్యాసాధ్యాలపై నిర్ణయాలు వెలువడితే.. పనులు వేగంగా జరుగుతాయని అంటున్నారు. విమానాశ్రయాలు నిర్మించాలని భావించే ప్రాంతాల్లో సర్వే, తదితర పనుల నిమిత్తం.. మౌలిక వసతులు, పెట్టుబడుల విభాగం ఇప్పటికే రూ. 1.06 కోట్లను విడుదల చేసిందని తెలుస్తోంది.

ఈ విమానాశ్రయాల కోసం.. వరంగల్ సమీపంలోని మామ్నూరులో, నిజామాబాద్ సమీపంలోని జక్రాన్ పల్లిలో పెద్దపల్లికి సమీపంలోని బసంత్ నగర్ లో, ఆదిలాబాద్ పట్టణానికి దగ్గరగా, మహబూబ్ నగర్ సమీపంలోని అడ్డాకులలో, ఖమ్మం సమీపంలోని కొత్త గూడెంలో ఇప్పటికే స్థలాలను గుర్తించడం జరిగిందని సమాచారం.

అయితే వరంగల్ విషయంలో మాత్రం కొన్ని సాంకేతిక అంశాలు అడ్డుగా నిలిచే అవకాశాలున్నాయి. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్ పోర్టును నిర్మించరాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, జీఎంఆర్ ల మధ్య ఓ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఆర్జీఐఏకు, వరంగల్ సమీపంలోని మామ్నూరుకు మధ్య 150 కిలోమీటర్ల దూరం కూడా లేదు. ఈ విషయంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.