అమరావతికే కాదు...ఏ ప్రాజెక్ట్ కీ నిధులు రావు !

 

నిన్న సాయంత్రం అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వలేమని ప్రపంచ బ్యాంక్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన దుర్మార్గాల వల్లే ప్రపంచ బ్యాంకు రుణాన్ని తిరస్కరించిందని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. . రాజధాని నిర్మాణానికి రుణమివ్వాలని ప్రపంచ బ్యాంకును అడిగింది చంద్రబాబేనని గుర్తు చేసిన ఆయన టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలతో రాజధాని రైతులు భయాందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. 

అందువల్లనే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు పంపారని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు రుణాన్ని తిరస్కరించడంలో వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.  ఈ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు శ్రీ కాంత్ రెడ్డి మీద మండిపడ్డారు. ప్రపంచబ్యాంకు వెనక్కి తగ్గడానికి వైసీపీనే కారణమని బాబు ఆరోపించారు. రైతుల పేరిట ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదులు చేయించారని అందుకే వారు వెనక్కి తగ్గారని మండిపడ్డారు. ఒక్క అమరావతికే కాదనీ ఏ ప్రాజెక్టుకు ఇకపై నిధులు రావని బాబు జోస్యం చెప్పారు.