భయపడుతున్న కడియం, లక్ష్మారెడ్డి..?

తెలంగాణలో ఎంసెట్-2 లీకేజీ వ్యవహరం తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై రంగంలోకి దిగిన సీఐడీ వేగంగా దర్యాప్తు కొనసాగిస్తూ మొత్తం డొంకను కదిలిస్తోంది. దీనిపై నివేదిక తయారు చేసి దానిని ప్రభుత్వానికి అందించింది. మొత్తం 130 మందికి పేపర్లు లీకైనట్లు రిపోర్టులో వెల్లడించారు సీఐడీ అధికారులు. 80 కోట్ల రూపాయల స్కాంతో ప్రభుత్వానికి తలవంపులు రావడమే కాకుండా..మంచి ర్యాంక్ వచ్చిందన్న సంతోషం కొద్ది రోజులు కూడా నిలవకపోవడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. లీకేజీ కారణంగా మళ్లీ ఎంసెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. నిందితుల్లో కొందరిని అరెస్ట్‌ చేయగా..కీలక నిందితుల కోసం సీఐడీ గాలిస్తోంది.

 

అంతా బాగానే ఉంది కాని అందరిలో ఇంతటి మనోవ్యధకు కారణమైన స్కాంకు నైతిక బాధ్యత ఏ శాఖా తీసుకోవడం లేదు. విద్యాశాఖ మంత్రి, అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరికి వారు ఈ అంశం తనది కాదంటూ తప్పించుకు తిరుగుతున్నారు. సాధారణంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహిస్తారు. ఎంసెట్ నిర్వహణకు కన్వీనర్‌ను ఎంపిక చేసి, పరీక్ష నిర్వహించి, ఫలితాలు వెల్లడించే వరకు విద్యాశాఖ బాధ్యత ఉంటుంది. ఎంసెట్ పరీక్ష ఏ యూనివర్శిటీ నిర్వహించాలనేది ఉన్నత విద్యామండలి నిర్ణయిస్తుంది. మెడిసిన్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్-2 నిర్వహణ బాధ్యతలను ఎంసెట్-1 కన్వీనర్ అయిన రమణారావుకే అప్పగించింది ప్రభుత్వం. ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఎంసెట్-2తో సంబంధం లేకపోవడంతో విద్యాశాఖ పట్టించుకోలేదు. అయితే ఎంసెట్-2 నిర్వహణ బాధ్యత కూడా ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించాల్సి రావడంతో సంబంధిత అధికారులు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో సంప్రదించి ఎంసెట్-2 తేదీలను ఖరారు చేసి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ రమణరావుతో కలిసి మంత్రి లక్ష్మారెడ్డి ఎంసెట్-2 ర్యాంకులను విడుదల చేశారు.

 

పేపర్ లీకేజీ కావడంతో ఇప్పుడు ఈ వ్యవహారం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని మంత్రులు లోలోపల భయపడుతున్నారు. ఈ క్రమంలో నోటిఫికేషన్, నిర్వహణ బాధ్యత విద్యాశాఖదేనని వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి..షెడ్యూలును ప్రకటించి, ర్యాంకులను విడుదల చేసింది వైద్యశాఖేనంటూ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి నిందితులే ఏ శాఖ అధికారులు తమకు సహకరించారో చెబితే కాని మంత్రుల డౌట్ క్లియర్ అయ్యేట్లు కనిపించడం లేదు.