మరోసారి గొంతెత్తిన రాహుల్‌గాంధి

నాలుగు నెలల తరువాత రాహుల్‌గాంధి మరోసారి గళం విప్పారు. గత పార్లమెంటు సమావేశాల్లో నల్లధనాన్ని వెలికితీయడంలోనూ, ఉద్యోగాలను కల్పించడంలోనూ, కరువుని నివారించడంలోనూ... ప్రభుత్వం విఫలమైందంటూ రాహుల్‌ చేసిన సుదీర్ఘ ఉపన్యాసం ప్రజల దృష్టిని ఆకర్షించింది. కానీ రాహుల్‌ ఆరోపణలకు మోదీ ఇచ్చిన ఘాటైన జవాబులు మరింత జనరంజకంగా నిలిచాయి. రాహుల్‌ మీద నేరుగా నేర్పుగా మోదీ ఎక్కుపెట్టిన బాణాల ముందు రాహుల్‌ ఉపన్యాసం వెలవెలబోయింది. అందుకేనేమో ఈసారి వర్షాకాల సమావేశాల సందర్భంగా, రాహుల్‌ ఆచితూచి ఉపన్యసించారు. పెరుగుతున్న ధరల మీదా, మేక్ ఇన్‌ ఇండియా వైఫల్యం మీదా ఎక్కువగా ప్రసంగించారు.

ఒకప్పుడు విపణిలోకి చేరిన కందిపప్పుని 30 రూపాయలు లాభం వేసుకుని అమ్మేవారనీ, ఇప్పుడు ఆ తేడా 130 రూపాయలకు చేరుకుందని మండిపడ్డారు రాహుల్. తమ రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటున్న మోదీ ప్రభుత్వం, పెరుగుతున్న ధరల గురించి మాత్రం నోరు విప్పడం లేదంటూ దెప్పి పొడిచారు. అంతేకాదు! ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకొంటున్న మేక్ ఇన్‌ ఇండియా ద్వారా ఇంతవరకూ ఒక్క ఉద్యోగాన్ని కూడా కల్పించలేదంటూ ఆరోపించారు. ధరల నియంత్రణకు సంబంధించి మోదీ, ఒక స్పష్టమైన కాలపరిమితితో పార్లమెంటు ముందుకు రావాలని సూచించారు.

ఈసారి రాహుల్‌గాంధి ప్రసంగానికి మోదీ ఏం జవాబు ఎంత ఘాటుగా ఇస్తారో చూడాలి!