నవాజ్‌ పీఠానికి పీవోకే ఎసరు..?

posted on: Jul 29, 2016 5:56PM

ఇన్నాళ్లు దేని కోసమైతే ఆరాటపడుతోందో..ఎవరి సపోర్ట్‌ ఉందని భావిస్తూ మనదేశంపై విషం కక్కాలని చూస్తోందో..వాళ్లే..ఆ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలే పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కదం తొక్కారు. దీనంతటికీ కారణం ఇటీవల జరిగిన ఎన్నికలే. అక్కడ నిర్వహించిన ఎన్నికల్లో ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పాకిస్థాన్ ముస్లిం లీగ్ రిగ్గింగ్ చేసి గెలిచిందని పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. 42 స్థానాలకు గాను 32 స్థానాల్లో నవాజ్ పార్టీ జయకేతనం ఎగురవేయగా..ఇతర పార్టీలకు ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి. తమను పోలింగ్ బూతుల వద్దకు రాకుండా అడ్డుకున్న అధికారులు యథేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, లేకుంటే అన్ని సీట్లు ఎలా వస్తాయని జనం నిలదీస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని..తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఎన్నికల్లో అక్రమాలను నిరసిస్తూ పీవోకేలో ప్రజలు, విపక్షాలు చేస్తోన్న ఆందోళనలతో ఆ ప్రాంతం అట్టుడికిపోతోంది. పీవోకే రాజధాని నగరమైన ముజఫరాబాద్ సహా కోట్లి, చినారి, మిర్పూర్ నగరాల్లో ఆందోళనలు మిన్నంటాయి. కొందరు నిరసనకారులు పాక్ జాతీయ జెండాను తగులబెట్టారు. పీవోకేలో పాక్ వ్యతిరేక ఆందోళనలు జరగడం ఇదేం కొత్తకాదు..ఉద్యోగాల భర్తీపై గతంలో అక్కడి యువత పోరాటం చేసింది. అసలు ఇక్కడ ఉద్యోగాల భర్తీయే చాలా అరుదు కాగా, కాస్తో కూస్తో ఖాళీలు ఏర్పడగానే స్థానిక కశ్మీర్ యువతను కాదని పాకిస్థాన్ వారికే అవకాశాలు ఇవ్వడంపై యువత భగ్గుమంది. అయితే ఆ ఉద్యమాన్ని పాక్ ఉక్కుపాదంతో అణచివేసింది.

 

అయితే తాజా ఆందోళన కాస్తా పెరిగీ పెరిగీ అది పాకిస్థాన్ వ్యతిరేక ఉద్యమంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇది అటు తిరిగి అటు తిరిగి తన పీఠాన్ని ఎక్కడ కదిలిస్తుందేమోనని ప్రధాని నవాజ్ షరీఫ్ భయపడిపోతున్నారు. అందుకే ఆందోళనపై ఉక్కుపాదం మోపాలని అక్కడి బలగాలకు ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. అటు పీవోకే ప్రజల ఆందోళనపై స్పందించిన భారత్..సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కశ్మీర్‌లో అల్లర్లపై మాట్లాడటం సిగ్గు చేటని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వ్యాఖ్యానించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...