బాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ వార్త విని గుండె ఆగి మరణించిన టీడీపీ కార్యకర్త
posted on Sep 22, 2023 4:28PM
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజలు, పార్టీ శ్రేణులు ఎక్కడి కక్కడ నిరశన దీక్షలు చేస్తున్నారు. అలాగే తెలుగునా తెలుగు దేశం పార్టీని ఇంటి పార్టీగా, చంద్రబాబును ఇంటి ఇలవేలుపుగా ఆరాధించే ప్రజలు, అభిమానులు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రాణాలు ఇచ్చేందుకు అయినా సిద్దమనే రీతిలో దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేని పలువురు ఆ బాధలో కన్ను ముస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి ఇంతవరకు పదుల సంఖ్యలో చంద్రబాబు అభిమానులు మనస్తాపంతో కన్ను మూశారు.
తాజాగా ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిందన్న వార్త వినగానే ఆయన మరి కొన్ని రోజులు జైలులోనే ఉండకతప్పదన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకరు గుండెపోటుతో మరణించారు.
మూడు రోజుల కిందట చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసినప్పటి నుంచి తీర్పు అనుకూలంగా ఉంటుందని, ఆయన బయటకు వస్తారని ఆశతో ఎదురు చూస్తూ అదే విషయాన్ని అడిగిన వారికీ అడగని వారికీ కూడా చెబుతూ వస్తున్న చిత్తూరు జిల్లా ఒంటిమిట్టకు చెందిన తెలుగుదేశం కార్యకర్త శ్రీనివాసులు నాయుడు తీవ్ర మనస్తాపానికి లోనై గుండెపోటుతో మరణించారు.
శ్రీనివాసులు నాయుడు మృతదేహానికి నివాళులర్పించిన తెలుగుదేశం నేతలు ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఆదుకుంటామని చెప్పారు.