జగన్ గడ్డపై టిడిపి జెండా!

పులివెందులలో వైసీపీ డిపాజిట్ గల్లంతు 
ఒంటిమిట్టలో తెలుగుదేశానికి భారీ మెజారిటీ

జగన్ అడ్డాపై టిడిపి జెండా ఎగిరింది. అదీ  మామూలుగా కాదు. కనీవినీ ఎరుగని రీతిలో. కడప ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జడ్పీటీసీ  ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిం చారు. పులివెందులలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంతయింది.  ఇంతవరకు కడప జగన్ అడ్డా అంటూ గొప్పలు చెప్పుకున్న వైసీపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. రెండు జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు ఉంటాయని  ఊహించిన టీడీపీ నాయకులు ముందు నుంచే వ్యూహాత్మకంగా పావులు కదిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక విషయంలో టీడీపీ నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిలో భాగంగానే పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం  ఇంచార్జ్ బీటెక్ రవి సతీమణిని రంగంలోకి దింపి వైసీపీని అయోమయంలో పడేశారు.

దీనికితోడు వైసీపీ ఆనుపానులు తెలిసిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి జడ్పీటీసీ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. 1995 నుంచి జడ్పీటీసీ ఎన్నికల్లో 2016 మినహా ఎప్పుడూ కూడా ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం రాలేదు. ఈ సారి ఇరు పార్టీలు ఇచ్చే తాయిలాలు పుచ్చుకుని ఈ అవకాశం టీడీపీ వల్లనే వచ్చిందనే భావన ప్రజల్లో ఉంది. దానికి కృతజ్ఞతగా ఆ పార్టీకి ఈసారి తెలుగుదేశం అభ్యర్థికి మద్దతుగా నిలిచారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

జెడ్పటీసి ఎన్నికల  విధానం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పులివెందులలో ఏ ఎన్నికలోనూ టిడిపి గెలవలేదు. 2 001లో జరిగిన ఎన్నికల్లో అయితే పోటీనే లేకుండా ప్రస్తుత వైసిపి అభ్యర్థి హేమంత్ రెడ్డి తండ్రి మహేశ్వర్ రెడ్డి  ఏకగ్రీవంగా గెలుపొందారు . అంటే జెడ్పీటీసీ  ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పులివెందల జడ్పిటీసీ స్థానం వైసిపి సొంతం అన్నట్లుగా గెలుస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ఆ చరిత్ర తిరగరాసి వైసీపీకి చేదు అనుభవాన్ని చవిచూపించడంలో టిడిపి వ్యూహం పలించిందనే చెప్పాలి. పులివెందుల ఉపఎన్నిక మొదటి నుంచి వైసీపీ, టిడిపిల మధ్య రభస  జరుగుతూనే వచ్చింది. పోలింగ్ రోజు వైసీపీ నేత ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడం, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లను హౌస్ అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది.  దీనిపై వైసీపీ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రీపోలింగ్ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో  పులివెందులలో టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది.

పులివెందుల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గెలవడమే కాదు ఆమెకు వచ్చిన ఓట్లు కూడా ఒక చరిత్రే. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన లతా రెడ్డికి 6716 ఓట్లు వస్తే,  వైసీపీ నుండి పోటీ చేసిన హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి.  అంటే 6033 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం విజయం సాధించింది. ఇంత పెద్ద మెజార్టీ రావడం చూస్తే  టిడిపిని సాధారణ ఓటర్లు బాగా ఆదరించారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వైసీపీ కి ఇంత తక్కువ ఓట్లు రావడం, టిడిపికి ఊహించని స్థాయిలో ఓట్లు రావడం చూస్తే కడపలో జగన్ కు చెక్ పెట్టే పరిస్థితి త్వరలోనే ఉంటుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

 పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం జెండా  రెపరెపలాడడం లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మార్క్ కనిపిస్తోంది. పులివెందులలో మంచి రాజకీయ సంబంధాలు, బంధుత్వాలు కలిగిన ఆయన ఈ ఎన్నికల్లో తన ప్రభావం ఏంటో  చూపించారని చెప్పవచ్చు. గతంలో దివంగత వైయస్ వివేకానందరెడ్డిపై ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుత జడ్పిటిసిగా  గెలిచిన అభ్యర్థి లతా రెడ్డి భర్త బీటెక్ రవి పోటీ చేసినప్పుడు కూడా ఆదినారాయణ రెడ్డి మంత్రాంగం ఫలించింది. అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డికి తానేంటో  రుచి చూపించారు. ఇప్పుడు  జెడ్పీటీసి ఉప ఎన్నికలను అంతా తానై పదిరోజుల పాటు  పులివెందులలో తిష్ట వేసి ఊరు ,వాడ వీధి ,సందు అందరితో మాట్లాడి ఓటర్లను తమ వైపు మలుచుకోవడమే కాకుండా, ఓట్లు టిడిపి అభ్యర్థికి పోలయ్యే  విధంగా వ్యూహం రూపొందించారు.

పులివెందుల ఉప ఎన్నికపై  జిల్లా, స్థానిక నాయకులు సమష్టిగా కష్టపడ్డారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆదేశానుసారం ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించలేదు. సర్వ శక్తులు కూడగట్టుకొని విజయం సాధించడంలో ఎవరి మేరకు వారు సత్తా చాటారు. టిడిపి అభ్యర్థి భర్త పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్చార్జి బీటెక్ రవితో పాటు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి   నిరంతరం ఎన్నికల నిర్వహణలో పోలింగ్ వరకు వారి వ్యూహాలను అనుసరిస్తూ వారికున్న సంబంధాలను అభ్యర్థి గెలుపుకోసం కోసం సానుకూలంగా మలుచుకుంటూ వచ్చారు. వీరితోపాటు  జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా  చైతన్య రెడ్డి లు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. చైతన్య రెడ్డి తో పాటు టిడిపి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ,కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి లు పులివెందులలో ప్రచారం చేసి టిడిపి అభ్యర్ధి విజయం కోసం కష్టపడ్డారు . ప్రచారంలో బిజెపి నేత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తో పాటు పలువురు  బిజెపి నాయకులు కూడా పాల్గొన్నారు.  వీరితోపాటు కూటమిలో ఉన్న మరి కొందరు నాయకులు , కార్యకర్తలు గట్టిగా ప్రయత్నం చేశారు.


ఒంటిమిట్ట లోనూ టిడిపి విజయం కేతనంతో  ఉమ్మడి కడప జిల్లాలో తన సత్తా ఏంటో తెలుగుదేశం నిరూపించుకుంది. సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో ని 10 స్థానాల్లో ఏడు స్థానాలను కూటమి విజయం సాధించింది. పులివెందులతో పాటు ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో కూడా టిడిపి అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇక్కడ టిడిపి, వైసిపిల మధ్య రసవత్తర పోరు జరిగినట్టు అనిపించినా, వైసీపీ నాయకులు ఆశలు పెట్టుకొని గట్టిగా ప్రయత్నించినా గెలుపు వారికి దరిదాపుల్లో లేకుండా పోయింది .టిడిపి అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి భారీ మెజార్టీ లభించింది. వైసిపి అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి 6,513 ఓట్లు మాత్రమే రాగా టిడిపి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12,780ఓట్లు వచ్చాయి. దీంతో టిడిపి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6267ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఒంటిమిట్టలో టిడిపి నాయకులు పడ్డ కష్టాలు, కసరత్తు ఫలించింది . ఒంటిమిట్ట గెలుపు పట్ల  టిడిపి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  పులివెందుల, ఒంటిమిట్ట గెలుపు జిల్లా టిడిపి లో కొత్త ఉత్తేజం నింపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu