నలంద కిషోర్ మృతి.. బాధ్యులెవరు?
posted on Jul 25, 2020 11:07AM
విశాఖలో టీడీపీ సానుభూతిపరుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. సోషల్ మీడియాలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ ఇటీవల కిషోర్ ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. విశాఖ నుంచి కర్నూలుకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడ న్యాయస్థానంలో హాజరుపర్చారు. స్టేషన్ బెయిల్ పై కిషోర్ విడుదలై బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగోలేదని ఆయన బంధువులు అంటున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, కరోనా పాజిటివ్ అని అనుమానంతో ఆస్పత్రి సిబ్బంది శాంపిల్స్ సేకరించింది.
ఇదిలా ఉంటే, నలంద కిషోర్ మృతికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, సీఐడీ పోలిసుల నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా పరీక్షల పేరుతో ఆయనను కర్నూల్ లో కరోనా పాజిటివ్ పేషంట్ల వార్డ్ లో ఉంచారని, అక్కడే ఆయనకు కరోనా సోకిందని, అందుకే మరణించారని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు ఆయన ప్రాణాలను బలి తీసుకున్నరంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.