అవినీతి ‘ద్వారం’పూడిని మూసేస్తున్నారా?

కాకినాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపైడ చంద్రశేఖర్ అవినీతి గట్టు రట్టు చేయడంతో పాటు, ఆయన ఇక బయటపడలేని విధంగా  చక్రబంధంలో ఇరికించేస్తున్నారా? అంటే ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఔననే సమాధానమే వస్తున్నది. తాజాగా ద్వారంపూడి కుటుంబానికి చెందిన రొయ్యల శుద్ధి ఫ్యాక్టరీ పరిశ్రమ మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసంది. కాకినాడ జిల్లా కరప మండలం గురజనాపల్లిలో ద్వారంపూడి కుటుంబానికి చెందిన రొయ్యలశుద్ధి పరిశ్రమలో ఉల్లంఘనలు గుర్తించి ఈ ఏడాది ఆగస్టు 6న అధికారులు మూసివేయించారు.

ఇప్పుడు తాజాగా ప్రత్తిపాడు మండలం లంపకలోవ వద్ద ఉన్న మరో యూనిట్ మూసివేతకూ ఆదేశాలు జారీ అయ్యాయి. వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ పేరిట ద్వారంపూడి కుటుంబమే ఈ రొయ్యల శుద్ధి ఫ్యాక్టరీని  నిర్వహిస్తోంది. తనిఖీల్లో ఈ పరిశ్రమలో నిబంధనల ఉల్లంఘనను గుర్తించి అధికారులు ముందుగా అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో అనివార్యంగా క్లోజింగ్ ఆర్డర్స్ జారీ చేశారు. ఇప్పటికే ద్వారంపూడి రేషన్ బియ్యం దందాపై దృష్టి పెట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. ఆ మాఫియాకు అడ్డుకట్ట వేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అక్కడితో ఆగకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ కు చెందిన ఇతర వ్యాపారాలు, వ్యాపకాలలో నిబంధనల ఉల్లంఘనపై కూడా నిఘా పెట్టింది.

అందులో భాగంగానే తాజాగా ఆయనకు చెందిన రొయ్యల శుద్ధి పరిశ్రమలో నింబంధనల ఉల్లంఘనలను గుర్తించి మూసి వేయించింది.  సమగ్ర విచారణ, దర్యాప్తులను సత్వరమే నిర్వహించి ద్వారంపూడి అక్రమాలు, అవినీతి దందాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అడుగులకు పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.