ఓట్లు పెరిగినా ఓటమి తప్పలేదా?
posted on Jun 17, 2012 10:20AM
2012 ఉపఎన్నికల చిత్రంలో ఇదీ ఒక విచిత్రమే అనుకోవాలి. ఒక పార్టీకి ఓట్లు పెరిగినా ఓటమి తప్పలేదు. ఈ పార్టీ పదిస్థానాల్లో వై,ఎస్,ఆర్, కాంగ్రెస్ పార్టీ తో హోరా హోరీగా పోరాడిందే. ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది అదే తెలుగుదేశం గురించేనని. ఎగ్జాట్లీ ... మీరు ఊహించింది నిజమే. తెలుగుదేశంపార్టీ తన క్యాడర్ ను పెంచుకునేందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకుందన్నది జగమెరిగిన సత్యం. దీనికి అనంతపురం నియోజకవర్గంలో పరిస్థితే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బతీసిన ఈ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ ఓట్లు పెరిగాయి. 2009 ఎన్నికల్లో తెలుగుదేశానికి 32వేల ఓట్లు పోలయ్యాయి.
2012 ఉపఎన్నికల్లో ఇదే పార్టీకి 40వేల చిల్లర ఓట్లు పోలయ్యాయి అంటే సుమారు 9వేల ఓట్లు ఈ పార్టీకి పెరిగినా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని గెలుపొందింది. రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ నుంచి దేశంలోనే అత్యంత ధనికుడు దీపక్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడర్ తగ్గింది. అందుకే ఓటింగ్ తగ్గిందని పరిశీలకులు వెల్లడి చేస్తున్నారు. 2009లో తెలుగుదేశం అభ్యర్థి గోవిందరెడ్డికి 62,000ఓట్లు వచ్చాయి. 2012లో దీపక్ రెడ్డికి 40,000ఓట్లు పోలయ్యాయి. అంటే 20వేల ఓట్లు తగ్గాయి.