శాసన సభ సాక్షిగా జగన్ అబద్దం చెప్పారు: టీడీపీ ఎమ్మెల్యే

 

 

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. తాజాగా సున్నా వడ్డీ రుణాల విషయంలో తాము చెప్పిందే  కరెక్టని ప్రభుత్వ పక్షం, కాదు మేము చెప్పిందే వాస్తవమని విపక్షం ప్రజలను నమ్మించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నిన్న జరిగిన సమావేశాలలో టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పై ఒక్క పైసా ఋణం ఇవ్వలేదని, అలాగే అదే విషయం నిరూపిస్తే చంద్రబాబు రాజీనామాకు సిద్ధమా అని సీఎం జగన్ సవాల్ విసిరారు. దానికి ప్రతిగా నిన్న సాయంత్రం చంద్రబాబు తమ పాలనలో ఏఏ సంవత్సరంలో సున్నా వడ్డీ పై ఎంతెంత ఋణం మంజూరు చేసింది ప్రెస్ మీట్ లో వివరాలతో సహా వెల్లడించారు. తాజాగా ఈ రోజు సీఎం జగన్ కూడా సభలో నిన్న బాబు విలేకరులకు అందించిన వివరాలను యధాతధంగా పేర్కొన్నారు. ఇపుడు ఇదే విషయమై టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు సీఎం జగన్ వ్యవహార శైలిని తప్పు పడుతూ నిన్న నిండు అసెంబ్లీలో అవాస్తవాలు చెప్పారని విమర్శించారు. సీఎం జగన్ చెప్పిన సున్నా వడ్డీ పథకం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాం నుంచే ఉందనీ, కొత్తగా ప్రవేశపెట్టిన పథకం కాదని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు సున్నా వడ్డీ పథకం కింద పైసా ఇవ్వలేదని నిన్న సీఎం జగన్ చెప్పారనీ, కానీ ఈరోజు మాత్రం రూ.630 కోట్లు ఇచ్చినట్లు అంగీకరించారని తెలిపారు.