మైసూరాతో జగన్ మంతనాలు
posted on May 1, 2012 10:23AM
కడపజిల్లాలో ప్రస్తుతం తెలుగుదేశంపార్టీకి పెద్దదిక్కుగా ఉన్న రాజ్యసభ మాజీ సభ్యుడు మైసూరారెడ్డితో జగన్ ఇటీవల మంతనాలు జరిపినట్లు తెలిసింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మైసూరారెడ్డి వై.ఎస్. హయాంలో తెలుగుదేశంపార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. అయితే ఆ తరువాత రెండేళ్ళుగా ఆయన పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనటం లేదు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి టిక్కెట్టు కోసం ఆయన ప్రయత్నిచి విఫలమయ్యారు. దీంతో ఆయనలో అసంతృప్తి మరికాస్త పెరిగింది.
ఈ విషయాన్ని గమనించిన జగన్ మైసూరారేడ్డితో ఇటీవల టెలిఫోన్ లో మాట్లాడినట్లు తెలిసింది. తమ పార్టీలో వస్తే భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉన్న పదవి ఇస్తానని మైసూరాకు జగన్ వాగ్దానం చేసినట్లు తెలిసింది. పాట విషయానాలు మరిచిపోయి తమ పార్టీలో చేరాలని జగన్ కోరినట్లు తెలియవచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో కడప జిల్లా కమలాపురం, పెద్దచెట్ పల్లి ఆలయ ఆవరణలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విందుకు మైసూరారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, మైసూరారేడ్డితో కొద్దిసేపు మంతనాలు జరిపారు. వీరిద్దరి కలయిక జిల్లాలో చర్చలకు దారితీసింది.