ఓడిపోయిన నేతలకు దారి చూపిస్తున్న బోడె ప్రసాద్

 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. అధికారం నిబెట్టుకోవాలని భావించిన టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని ఘోర పరాజయం చవిచూసింది. బడాబడా నేతలు సైతం ఫ్యాన్ స్పీడ్ ముందు నిలవలేకపోయారు. ఈ ఘోర ఓటమితో టీడీపీ నేతలు బయటకొచ్చి ప్రజలకు మొహం చూపించలేకపోతున్నారు. అయితే ఒక నేత మాత్రం మిగతా వాళ్లందరికీ భిన్నంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయనే బోడె ప్రసాద్.

టీడీపీకి కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలోనూ ఈ ఎన్నికల్లో టీడీపీకి నిరాశజనక ఫలితాలొచ్చాయి. చివరికి పార్టీకి అండగా ఉంటాయనుకున్న సామాజికవర్గాలు కూడా మద్దతుగా నిలువలేదన్నట్లుగా ఫలితాలు వచ్చాయి. అలాంటి ఫలితాలు వచ్చిన నియోజకవర్గాల్లో పెనమలూరు ఒకటి. టీడీపీకి మద్దతుగా ఉండే సామాజికవర్గాలు.. ఆ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటాయనే ప్రచారం ఉంది. అందుకే.. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విజయం ఖాయమనుకున్నారు. కానీ.. అక్కడ అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి పార్థసారధికి భారీ మెజార్టీ లభించింది.

ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో బోడె ప్రసాద్ షాక్ తిన్నారు. కానీ ఒక్కరోజులోనే ఆ షాక్ నుంచి బయటికొచ్చారు. ఫలితాలు వచ్చిన రెండో రోజే.. తాను మాజీ ఎమ్మెల్యేనన్న భావన మర్చిపోయారు. తన ద్విచక్ర వాహనాన్ని తీసుకుని.. పూటకో కాలనీలో తిరుగుతున్నారు. ఇంటింటికి వెళ్లి.. తనకు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఓటు వేయని వారైతే.. తనను క్షమించాలని కోరుతున్నారు. తనకు తెలిసి ఎలాంటి తప్పూ చేయలేదని ఒకవేళ తప్పు చేసినట్లయితే క్షమించాలని చేతులు పట్టుకుని మరీ విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు ప్రజలు నువ్వు తప్పు చేయడం ఏంటన్నా అని అన్నట్లు తెలుస్తోంది.

 

 

ఒంటరిగా బోడె ప్రసాద్ బైక్ వేసుకుని.. తనకు పెద్దగా ఓట్లు రాని ప్రాంతాలకు వెళ్తున్నారు. అందర్నీ కలిసి చెప్పాలనుకున్నది చెబుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలకే కాకుండా, మిగతా పార్టీల నేతలకు కూడా బోడె ప్రసాద్ దారి చూపిస్తున్నారని అనుకోవచ్చు. ఓడిపోయినప్పటికీ ఆయన నిరాశ చెందకుండా ఐదేళ్ల పాలనా కాలంలో తను తప్పులు చేసినట్లు తేలితే క్షమించాలని కోరుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ప్రజలను, ప్రత్యర్థి పార్టీలను తప్పు పట్టడమో, లేక దాడులు చేయడమో చేసే నేతలున్న ఈ రోజుల్లో.. తాను తప్పు చేస్తే క్షమించండి అని ప్రజల్లోకి వెళ్లడం నిజంగా అభినందించదగ్గ విషయమనే చెప్పాలి.