హుజురాబాద్ బరిలో టీడీపీ.. సత్తా చాటుతామంటున్న బక్కని
posted on Sep 30, 2021 3:28PM
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ రావడంతో ఎన్నికల వేడి పెరిగింది. ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి జనంలోనే ఉన్న అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు.. ఇప్పుడు మరింత స్పీడ్ పెంచాయి. టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించగా... బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఉండబోతున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అక్టోబర్ 1నుంచి నామినేషన్లు షురూ కానుండటంతో.. రేపో మాపో క్యాండిడేట్ ను ప్రకటించబోతోంది హస్తం పార్టీ. అయితే హజురాబాద్ బరిలోకి టీడీపీకి వచ్చింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీడీపీ బరిలోకి దిగుతుందని ఆ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అంబటి జోజిరెడ్డి తెలిపారు. ఇక్కడి నుంచి బరిలోకి దిగే అభ్యర్థిని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు త్వరలోనే ప్రకటిస్తారని తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీలను ఓడించి టీడీపీకి పట్టం కట్టాలని అభ్యర్థించారు. తెలంగాణలో టీడీపీ ప్రస్తుతం పూర్తిగా బలహీనంగా ఉంది. ఆ పార్టీలో ఉన్న నేతలంతా అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీలో చేరిపోయారు. ఇటీవలే ఎల్ రమణ కారెక్కారు. టీడీపీలో కీలక నేత రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్ అయిపోయాడు. ఈ క్రమంలోనే నేతలంతా వెళ్లిపోయినా.. తెలంగాణలో ఉనికి చాటుకునేందుకు టీడీపీ ముందుకు రావడం విశేషం.
తెలంగాణ టీడీపీకి బక్కని నర్సింహులు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు. సామాన్య కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన బక్కని... పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు సూచనలతో ఆయన ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. హుజురాబాద్ లో పోటీ విషయమై బక్కని నర్సింహులుతో తెలుగు వన్ మాట్లాడింది. ఈ సందర్బంగా కీలక విషయాలు చెప్పారు బక్కని. గతంలో హుజురాబాద్ టీడీపీకి కంచుకోటగా ఉందని చెప్పారు. ముద్దసారి దామోదర్ రెడ్డి, పెద్దిరెడ్డిలు వరుసగా అక్కడి నుంచి విజయాలు సాధించారని చెప్పారు. తమకు ఇప్పటికే హుజురాబాద్ లో కేడర్ ఉందన్నారు. త్వరలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని బక్కని నర్సింహులు చెప్పారు.
అక్టోబరు 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. శుక్రవారంనోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ల దాఖలకు అక్టోబరు 8 చివరి తేదీ. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ఉంటుంది. నవంబరు 2న ఫలితం వెల్లడి కానుంది.