రైతు రుణమాఫీలపై టీడీపీ, జీజేపీ నిరసనలు.. టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్
posted on Oct 14, 2015 12:07PM
.jpg)
రైతు రుణమాఫీలపై తెలంగాణ టీడీపీ, బీజేపీ నేతలు అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. లక్షలోపు ఉన్న రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని.. వారికి కొత్త రుణాలు అందించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ, బీజేపీ నేతలు అబిడ్స్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. దీంతో అక్కడ పోలీసులు నేతలను అడ్డుకొనగా అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీ సహా మరికొందరు నేతలను అరెస్టు చేసి ఆబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ ఎన్నికలప్పుడు రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను మరిచిపోయారని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం రూ. 1000 కోట్లు మార్కెట్ ఫండ్ విడుదల చేస్తామని.. ఖరీఫ్‌లో రైతులకు రూ. 15వేల కోట్ల వరకు రుణాలు అందిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అందులో కనీసంఅయిదు వేల కోట్లయినా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇంకా ఈ నిరసనలో టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వం ఏం పట్టనట్టు వ్యవహరిస్తుందని.. లక్షలోపు ఉన్న రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.