ఏపీలో తెలుగుదేశం కూటమిదే హవా!.. తేల్చేసిన మరో జాతీయ సర్వే!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమిదే అధికారమని మరో జాతీయ సర్వే సంస్థ తేల్చేసింది. ఏపీలో అధికార వైసీపీ ఈ సారి ఎన్నికలలో గణనీయంగా నష్టపోతున్నదని పేర్కొంది. రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో వైసీపీ కేవలం ఎనిమిది స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నాయని కుండబద్దలు కొట్టింది.అదే విధంగా తెలుగుదేశం కూటమి 18 స్థానాలలో విజయకేతనం ఎగురవేయనున్నట్లు స్పష్టం చేసింది.

 ఏపీలో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది.   ఏపీలో ఈ సారి జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఏపీ ఎన్నికలపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇటువంటి తరుణంలో తాజాగా టీవీ-సీఎన్ఎక్స్ నిర్వహించిన సర్వే ఫలితం సంచలనం సృష్టిస్తోంది. ఈ సర్వే   ఏపీలో రాబోయేది తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమేనని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందన్ని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 17 లోక్ సభ స్థానాలలో విజయకేతనం ఎగురవేస్తుందని అంచనా వేసింది.

రాష్ట్రంలో మొత్తం పాతిక లోక్ సభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో తెలుగుదేశం పార్టీ 17 స్థానాలలో పోటీ చేయనుంది. తెలుగుదేశం పార్టీ పోటీ చేసే 17 స్థానాలలో 14 స్థానాలలో విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. అలాగే కూటమిభాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీ వరుసగా రెండు, ఆరు స్థానాలలో పోటీ చేయనున్నాయి. జనసేన పోటీ చేసే రెండు స్థానాలలో ఒక స్థానంలో విజయం సాధిస్తుందనీ, ఇక బీజేపీ పోటీ చేసే ఆరు స్థానాలలో రెండింటిలో గెలుస్తుందనీ సర్వే పేర్కొంది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పాతిక స్థానాలకు గానూ కేవలం ఎనిమిది స్థానాలలోనే విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.  అంటే కూటమి రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో  17 స్ధానాలను కేవసం చేసుకుంటుంది. అధికార వైసీపీ ఎనిమిది స్థానాలకు పరిమితమౌతుంది.  

ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే తెలుగుదేశం 114 స్థానాలలో పోటీ చేస్తుండగా, బీజేపీ పది స్థానాలలో, జనసేన 21 స్థానాలలో అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి.  వైసీపీ 175 నియోజకవర్గాలలోనూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. రాష్ట్రంలో పోటీ ప్రధానంగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, వైఎస్ జనగ్ నేతృత్వంవలోని వైసీపీ మధ్యే ఉంటుందని సర్వే స్పష్టం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావాలని చూస్తున్నది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టిన షర్మిల ఏపీలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు శతధా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు వరకూ రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ ఆ తరువాత బలహీనపడి ఉనికి మాత్రంగా మిగిలిన సంగతి తెలిసిందే. కాగా రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభావం స్వల్పంగానే ఉంటుందనీ, ఆ పార్టీ గెయిన్ చేసే ఓట్లు వైసీపీకి నష్టం చేస్తాయనీ సర్వే అంచనా వేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలలో అధికార కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాలలోనూ, బీజేపీ 5, బీఆర్ఎస్ 2, ఎంఐఎం ఒక స్థానంలోనూ గెలిచే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.