పొరుగు రాష్ట్రాలకు తెదేపా విస్తరణ అంత వీజీ కాదేమో

 

జాతీయహోదా సాధించే ప్రయత్నంలో తెదేపా ఈనెల 10వ తేదీన పొరుగునున్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించాలని నిశ్చయించుకొంది. ఆ రెండు రాష్ట్రాలలో చాలా మంది తెలుగువారు స్థిరపడి ఉన్నందున అక్కడికి పార్టీని వ్యాపింపజేయడానికి తెదేపా పెద్దగా శ్రమ పడనవసరం లేదు. కానీ పొరుగు రాష్ట్రాలలో బలంగా నిలద్రోక్కుకొని ఉన్న ప్రాంతీయ పార్టీలు తమకు పోటీగా వస్తున్న తెదేపాను స్వాగతించబోవు కనుక మొట్ట మొదట వాటి నుండి కొంత వ్యతిరేఖత ఎదుర్కోవలసి రావచ్చును. ఇక మరో సమస్య ఏమిటంటే కర్నాటకలో ముఖ్యంగా బెంగళూరులో ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల నుండి వెళ్లి స్థిరపడినవారు చాలా మందే ఉన్నారు. కనుక వారిలో తెలంగాణాకు చెందినవారిని తెదేపా ఆకర్షించగలుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.

 

ఇక బళ్లారిలో పూర్తిగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే స్థిరపడినప్పటికీ వారు తెదేపా, వైకాపాల మధ్య చీలిపోయున్నారు. ప్రస్తుతం వైకాపా ఇంకా అక్కడికి విస్తరించలేదు. కానీ త్వరలో విస్తరిస్తే వారు వైకాపా వైపు మ్రోగ్గు చూపే అవకాశం ఉంది. కానీ వైకాపా కంటే ముందుగానే తెదేపా పొరుగు రాష్ట్రాలలో ప్రవేశిస్తునందున అక్కడ తెదేపా త్వరగా స్థిరపడే అవకాశం ఉంటుంది.

 

ఇటీవల శేషాచలం అడవులలో ఎర్ర చందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ పై చెన్నైలో అన్ని రాజకీయ పార్టీలు స్వచ్చంద సంస్థలు ధర్నాలు, ర్యాలీలు చేసి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం జేసాయి. ఆ వేడి ఇంకా పూర్తిగా చల్లారక మునుపే తెదేపా పార్టీ ఈనెల 10న చెన్నైలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించాలనుకోవడం వలన ఊహించని కొత్త సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చును. కనుక చెన్నైలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరికొన్ని నెలలు వాయిదా వేసుకొనే ఆలోచన చేస్తే మేలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

అండమాన్ నికోబార్ దీవులలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే అత్యధికంగా స్థిరపడి ఉన్నారు. పైగావారు రాష్ట్ర రాజకీయల పట్ల చాలా ఆసక్తి ఉన్నప్పటికీ, దూరాభారం కారణంగా ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా అక్కడికి వెళ్లి వారిని పార్టీలో చేర్చుకొనే ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు తెదేపా ముందుగా అక్కడికి వెళుతోంది కనుక ఆ పార్టీకి పూర్తి ప్రయోజనం దక్కవచ్చును.